అక్షరటుడే, వెబ్డెస్క్ : 8th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేబినెట్ గుడ్న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిదో వేతన కమిషన్‌కు ఆమోదం తెలిపింది.
కేంద్ర మంత్రివర్గం 8వ వేతన కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కమిషన్ 18 నెలల్లోపు సిఫార్సులను సమర్పిస్తుందని పేర్కొంది. 2026 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) వెల్లడించారు. కేబినెట్ తాజా నిర్ణయంతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పే కమిషన్ ఛైర్పర్సన్గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, సభ్యులుగా ప్రొఫెసర్ పులక్ గోష్, పంకజ్‌జైన్‌ను కేంద్రం నియమించింది.
8th Pay Commission | సంప్రదింపుల తర్వాత..
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సిబ్బందితో సంప్రదింపుల తర్వాత పే కమిషన్ (Pay Commission)ను ఖరారు చేసినట్లు తెలిపారు. వేతన సంఘం ఏర్పాటుపై రక్షణ, హోం మంత్రిత్వ శాఖలు, సిబ్బంది మరియు శిక్షణ శాఖ, అలాగే రాష్ట్రాలు వంటి ప్రధాన వాటాదారుల నుంచి గతంలోనే కేంద్రం సమాచారం కోరింది. ఈ క్రమంలో తాజాగా పే కమిషన్ ఏర్పాటు చేశారు.
8th Pay Commission | పెరగనున్న జీతాలు
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని సవరించడానికి పదేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం (Central Government) వేతన కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేస్తుంది. 7వ వేతన కమిషన్ ఫిబ్రవరి 2014లో ఏర్పాటైంది. దాని సిఫార్సులు 2016 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి. లెక్క ప్రకారం.. 8వ వేతన కమిషన్ 2026 జనవరి 1 నుంచి అమలు కావాల్సి ఉంది. కమిషన్ సిఫార్సుల మేరకు జీతాలు పెరగనున్నాయి. అయితే కమిషన్ 18 నెలలలోపు సిఫార్సులను సమర్పించనుంది. ఆ తర్వాతే జీతాలు పెంచే అవకాశం ఉంది. అయితే 2026 జనవరి 1 నుంచి వేతన కమిషన్ అమలు చేసి ఉద్యోగులకు పెంచిన వేతనాలు తర్వాత చెల్లిస్తారని సమాచారం.

