అక్షరటుడే, వెబ్డెస్క్ : Bhu Bharati | తహశీల్దార్ కార్యాలయాల్లో(Tehsildar Office) పని చేస్తున్న ఆపరేటర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెర్రాసిస్ సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఫీల్డ్ స్టాఫ్కు భారీగా జీతాలు పెంచింది.బీఆర్ఎస్ హయంలో ధరణి పోర్టల్(Dharani Portal) తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
భూముల రిజిస్ట్రేషన్, ఇతర లావాదేవీల కోసం తహశీల్దార్ కార్యాలయాల్లో ఆపరేటర్లను నియమించారు. ప్రస్తుతం టెర్రాసిస్ ఆధ్వర్యంలో 708 మంది ఫీల్డ్ స్టాఫ్ పని చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి(Bhu Bharati) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెరాసిస్ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఆపరేటర్లను ప్రభుత్వం భూ భారతి కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది.
Bhu Bharati | దసరా కానుక
ఆపరేటర్లను టీజీటీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులు(TGTS Contract Employees)గా గుర్తించడంతో పాటు జీతాలు భారీగా పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో వారికి నెలకు రూ.12 వేల వేతనం అందించేవారు. దీనిని తాజాగా ప్రభుత్వం రూ.28,148లకు పెంచింది. దీంతో ప్రభుత్వ తమకు దసరా కానుక ఇచ్చిందని ఫీల్డ్ స్టాఫ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమకు వేతనాలు పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తాము కోరుతున్న ఉద్యోగ భద్రత, జీతాల పెంపు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. భూ భారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి, తమకు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.