అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gold Price | బంగారం కొనాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది. బంగారం ధర మళ్లీ భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కొత్త ఆల్ టైంహైని టచ్ చేసింది. వెండి కూడా బంగారం కంటే స్పీడ్‌గా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో వెండి కూడా ఆల్ టైం హై రికార్డ్ సృష్టించింది.
గత వారం కాస్త శాంతించినట్లు కనిపించిన పసిడి ధరలు (Gold Rates) మళ్లీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే బంగారం ధరలు పైపైకి ఎగబాకుతూ కొత్త రికార్డులను నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 1,37,430 కి చేరింది. 22 క్యారెట్ల నాణ్యమైన బంగారం ధర 1,25,850 పలుకుతుంది.
Gold Price | ధరల పెరుగుదలకు కారణాలివే..
బంగారంతో పాటు వెండి ధరలు (Silver Prices) కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర సుమారు రూ.3,000 పెరిగి దేశవ్యాప్తంగా రూ.2,00,900 స్థాయికి చేరింది. గత 8 రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ.17,000 పెరగడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో తులం వెండి రూ.2,130కి లభిస్తోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2,13,000ను తాకగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ దాదాపు ఇదే స్థాయిలో ధరలు కొనసాగుతున్నాయి. పలు నగరాల్లో వెండి ధరలు రూ. రెండు లక్షల మార్కును దాటడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భారత్–అమెరికా (India-America) మధ్య ఒప్పందంపై కొనసాగుతున్న సందిగ్ధత, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడడం, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోతపై అంచనాలు పెరగడం వంటి అంశాలు పసిడి, వెండి ధరలకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే రానున్న రోజుల్లో కూడా బంగారం, వెండి ధరలు అధిక స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గించడంతో బంగారం, వెండి ధరలపై ప్రత్యక్ష ప్రభావం కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోని (International Market) ధరల కదలికలు, దిగుమతి సుంకాలు, పన్నులు, అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువలో మార్పులు భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలన్నీ కలిసి దేశీయ మార్కెట్లో (Domestic Market) పసిడి రేట్లను నిర్ణయిస్తాయి.
భారతదేశంలో బంగారం కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా సంప్రదాయం, పెట్టుబడిగా కూడా విడదీయరాని భాగంగా మారింది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల సమయంలో బంగారం కొనుగోలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అదే సమయంలో చాలామంది దీన్ని భద్రమైన పెట్టుబడిగా భావిస్తూ కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్ పరిస్థితులు తరచూ మారుతుండడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ ధరల ఊగిసలాటను జాగ్రత్తగా గమనిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మార్పులపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండడం ఆర్థికంగా సరైన నిర్ణయాలకు కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.