HomeUncategorizedGold Price | చుక్కలు చూపిస్తున్న బంగారం ధర.. 10 గ్రాములకు రూ. 1.14 లక్షలు

Gold Price | చుక్కలు చూపిస్తున్న బంగారం ధర.. 10 గ్రాములకు రూ. 1.14 లక్షలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Price | బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజుకో రికార్డు సృష్టిస్తూ పైపైకి వెళ్తున్నాయి. శుక్రవారం నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,200లకు చేరింది. ధర ఇలా పరుగులు తీస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధరలిలా పెరిగితే శుభకార్యాలకు బంగారం ఎలా అన్న ఆందోళన నెలకొంది.

బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. శుభకార్యాలు, పండుగల సందర్భంగా బంగారు ఆభరణాలను ధరిస్తుంటారు. వివాహాది శుభకార్యాలలో దగ్గరి బంధువులు కానుకగా బంగారం ఇస్తుంటారు. ధనత్రయోదశి రోజున చాలామంది తప్పనిసరిగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. దీనిని ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడిగానూ చూస్తుంటారు. గతంలో మన దేశంలోని పరిస్థితులపై ఆధారపడి ధరలు ఉండేవి. పెళ్లిళ్ల సీజన్‌లో ధరలకు రెక్కలొచ్చేవి. గ్లోబలైజేషన్‌ కారణంగా భారతదేశంలోనూ బంగారం ధరలు గ్లోబల్‌ మార్కెట్లపై(Global Markets) ఆధారపడి ఉంటున్నాయి.

Gold Price | ఎందుకు పెరుగుతోందంటే..

బంగారం ధరలు(Gold Rates) అమాంతం పెరగడానికి అనేక కారణాలున్నాయి. ప్రధానంగా మనది పసిడి దిగుమతిపై ఆధారపడిన దేశం కావడం ధరలు అదుపులో లేకపోవడానికి ఓ కారణం. జియో పొలిటికల్‌ టెన్షన్స్‌, కరెన్సీ మార్పిడి రేట్లు, యూఎస్‌ ద్రవ్య విధానంవంటి కీలకమైన అంతర్జాతీయ అంశాలు ధరను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ కన్నా బంగారం సురక్షితమైన పెట్టుబడి మార్గంగా పరిగణిస్తున్నారు. దీంతో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతుండడంతో పసిడి పెరుగులు తీస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Gold Price | జియో పొలిటికల్‌ టెన్షన్స్‌..

ఇటీవలి కాలంలో చాలా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య మొదలైన యుద్ధం మూడేళ్లు దాటినా ముగింపునకు చేరుకోవడం లేదు. ఇజ్రాయిల్‌ – పాలస్తీనా, ఇజ్రాయిల్‌ – ఇరాన్‌, భారత్‌ -చైనా, భారత్‌ – పాకిస్థాన్‌.. ఇలా చాలా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ టెన్షన్స్‌కు తోడు అమెరికా తీసుకునే నిర్ణయాలు కూడా బంగారం ధర (Gold Price) పెరుగుదలకు కారణమవుతున్నాయి.

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక యూఎస్‌తోపాటు యూరోపియన్‌ యూనియన్‌ రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యాను ఆర్థికంగా ఇబ్బందిపెట్టేందుకు ఆ దేశ రిజర్వ్‌లను స్తంభింపజేశాయి. ఒక్క డాలర్లలోనే రిజర్వ్‌లను దాచి ఉంచితే ఎప్పటికైనా ప్రమాదమేనన్న విషయం ప్రపంచ దేశాలకు దీంతో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో రష్యాతోపాటు చైనా, భారత్‌లు కూడా బంగారం నిల్వలపై దృష్టి సారించాయి. బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా గుర్తించి భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. దీంతో పసిడికి భారీ డిమాండ్‌ ఏర్పడి ధర గణనీయంగా పెరిగింది.

Gold Price | యూఎస్‌ డాలర్‌ బలహీనపడడం..

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అమెరికా డాలర్లలో వర్తకం సాగుతోంది. అయితే కొన్నాళ్లుగా యూఎస్‌ డాలర్‌ బలహీనపడుతూ వస్తోంది. డాలర్‌ ఇండెక్స్‌ శుక్రవారం 97.56 కు పడిపోయింది. డాలర్‌ విలువ తగ్గుతుండడంతో ఇతర దేశాలు ప్రత్యామ్నాయంగా బంగారం వైపు చూస్తున్నాయి. దీంతో పుత్తడికి డిమాండ్‌ పెరిగింది. బంగారం ధర పెరగడానికి ఇది కూడా కారణమే..

Gold Price | ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనాలు..

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ నెలలో కీలకమైన వడ్డీ రేట్లను తగ్గించవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 25 బేసిస్‌ పాయింట్ల రేట్‌ కట్‌ ఉంటుందని ఆశిస్తున్నాయి. ఈ అంచనాలతో పుత్తడి ధర పెరుగుతోంది. వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తే బంగారం మరో 12 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

Gold Price | ట్రంప్‌ సుంకాలు తగ్గించినా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈనెల 8న మరో నిర్ణయం తీసుకున్నారు. కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ జాబితాలో నికెల్‌, బంగారం, వివిధ లోహాలు, ఫార్మాస్యూటికల్స్‌, రసాయనాలు ఉన్నాయి. ఇది బంగారానికి అనుకూలమైన మార్కెట్‌ వాతావరణాన్ని సృష్టించింది. అయితే డిమాండ్‌ పెరగడంతో ధర తగ్గడం లేదు. అయితే యూఎస్‌ డాలర్‌తో పోల్చితే కొన్నాళ్లుగా మన రూపాయి విలువ క్షీణిస్తోంది. శుక్రవారం ఒక డాలర్‌ విలువ రూ. 88.27 గా ఉంది. డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ విలువ బలహీనపడినప్పుడు.. అంతర్జాతీయంగా ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ బంగారం దిగుమతి ఖర్చు భారమై ధర పెరుగుతోంది.

Must Read
Related News