అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gold Rates | తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్న బంగారం రేట్లు సామాన్య ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది కావడంతో, ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లకు వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తోంది.
వివాహాలు, శుభకార్యాల సీజన్ కావడంతో నగరాల్లోని బంగారం దుకాణాలు (Gold Shops) కిటకిటలాడుతూనే ఉన్నాయి. నిన్న తులంపై ఏకంగా రూ.2 వేలకుపైగా పెరిగిన బంగారం ధరలు, ఇవాళ కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. జనవరి 27వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Gold Prices) పరిశీలిస్తే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,960గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,460గా ట్రేడవుతోంది.
Gold Rates | తగ్గేదే లే..
విజయవాడలోనూ ఇదే రేట్లు కొనసాగుతుండగా, ఢిల్లీ (Delhi)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,110, 22 క్యారెట్ల ధర రూ.1,48,610గా ఉంది. ముంబై, బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ.1,61,960, 22 క్యారెట్ల బంగారం రూ.1,48,460గా కొనసాగుతోంది. ఇక చెన్నైలో మాత్రం బంగారం ధరలు మరింత ఎక్కువగా ఉండి 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,920గా, 22 క్యారెట్ల ధర రూ.1,50,260గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరిగి మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. నిన్న ఒక్కరోజులోనే రూ.10 వేల వరకు పెరిగిన వెండి ధరలు పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేశాయి.
ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad)లో కిలో వెండి ధర రూ.3,75,100 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి, డాలర్ కదలికలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గుచూపడం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో కొనుగోలుదారులు, మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.