అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad CP | సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరెళ్లేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు వహించాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.
Nizamabad CP | ఊరెళ్తున్నామంటూ స్టేటస్లు పెట్టొద్దు..
చాలామంది తాము ఊరెళ్తున్నట్లుగా సోషల్ మీడియాలో (Social Media) స్టేటస్‌లో పెడుతుంటారని ఇది కరెక్ట్ కాదని సీపీ పేర్కొన్నారు. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలన్నారు. డోర్లకు సెంట్రల్ లాకింగ్ సిస్టం వాడాలన్నారు. గ్రామాల్లోని ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాలతో (CCTV cameras) ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఇంటిని గమనిస్తూ ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు వస్తే వారి సమాచారం పోలీస్ వారికి తెలియజేయాలని తెలిపారు. శివారు ప్రాంత కాలనీల్లో తాళం వేసిన ఇళ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం పరిశీలించి.. రాత్రివేళ చోరీలకు పాల్పడుతుంటారన్నారు. అలాంటివారిపై నిఘా పెట్టాలని చెప్పారు.
Nizamabad CP | పొరుగువారికి చూస్తూ ఉండాలని చెప్పాలి..
ఊరికి వెళ్తున్నప్పుడు ఇరుగుపొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలని సీపీ సూచించారు. పక్కింటి వారి ద్వారా ఇంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిదన్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఊరెళ్లిన సమయంలో ఎవరైనా అపరిచితులు సమాచారం పేరుతో వస్తే మహిళలు, వృద్ధులు నమ్మవద్దన్నారు. కాలనీల వారీగా ‘గస్తీ బృందాలను’ ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు.