అక్షరటుడే, కామారెడ్డి : Durga Matha | దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం 11 రోజుల పాటు కొనసాగాయి. ప్రతి సంవత్సరం అమావాస్య నుంచి దసరా (Dussehra) వరకు 9 రోజుల పాటు ప్రత్యేక పూజలందుకునే అమ్మవారు ఈ సంవత్సరం రెండు రోజులు అదనంగా పూజలు అందుకున్నారు. 11 రోజుల పాటు 11 అవతారాలలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అత్యంత నియమనిష్టల మధ్య నవరాత్రి ఉత్సవాలు కొనసాగాయి.
Durga Matha | రెండు రోజులు అదనంగా
దసరా వచ్చిందంటే దుర్గామాత నవరాత్రి ఉత్సవాలపై భక్తులు ప్రత్యేక దృష్టి పెడతారు. అమావాస్య నుంచి మొదలుకుని నిమజ్జనం వరకు ప్రత్యేక మాల ధరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం రెండు రోజుల పాటు ఎక్కువ రావడంతో 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు కొనసాగాయి.
Durga Matha | ప్రత్యేక పూజలు
దుర్గామాత నెలకొల్పిన నుంచి ఉద్వాసన వరకు అమ్మవారికి నిష్ఠగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక కుంకుమ పూజలు, అమ్మవారికి బోనాలతో మొక్కులు, పుష్పార్చన, దీపోత్సవం, మహాచండీ యాగం నిర్వహించారు. మండపం నిర్వాహకులు చేపట్టిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.
Durga Matha | 11 అవతారాలు
ప్రతి సంవత్సరం 9 రోజుల పాటు 9 అవతారాలలో దర్శనమిచ్చే అమ్మవారు ఈ సంవత్సరం 11 అవతారాలలో దర్శనమిచ్చారు. బాల త్రిపుర సుందరి దేవి, గాయత్రి దేవి, అన్నపూర్ణ దేవి, కాత్యాయని దేవి, మహాలక్ష్మీ దేవి, లలితా త్రిపుర సుందరి దేవి, మహాచండి దేవి, సరస్వతి దేవి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని దేవి, రాజరాజేశ్వరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు.
Durga Matha | నేడు అమ్మవారికి ఉద్వాసన
11 రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న దుర్గామాతకు గురువారం ఉద్వాసన పలికారు. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఉద్వాసన పలికారు. గురువారం మండపాలలోనే అమ్మవారిని ఉంచి శుక్రవారం సాయంత్రం లోపు నిమజ్జనం చేయనున్నారు.