అక్షరటుడే, వెబ్డెస్క్: Goddess Lakshmi | ధనం మూలం ఇదం జగత్.. ఈ ప్రపంచాన్ని నడిపించేది ధనమే. మరి ఆ ధనానికి అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే జీవితంలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అయితే, లక్ష్మీదేవి ఎక్కడ కొలువై ఉంటుంది..? ఆ తల్లి కటాక్షం పొందాలంటే ఏ పవిత్ర స్థానాలను పూజించాలి? ఇదే సందేహం ఒకసారి నారద మహర్షికి కలగగా, సాక్ష్యాత్తు శ్రీమహావిష్ణువు అమ్మవారు స్థిరంగా కొలువుండే ఐదు రహస్య స్థానాల గురించి వివరించారు. ఆ పవిత్ర స్థానాలు ఏమిటి, వాటిని ఎలా ఆరాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోమాత పృష్ఠ భాగం (ఆవు వెనుక భాగం): హిందూ ధర్మంలో గోవుకు విశిష్ట స్థానం ఉంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన నమ్మకం. ముఖ్యంగా ఆవు వెనుక భాగంలో (పృష్ఠము) లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే గోపూజ చేసేటప్పుడు వెనుక భాగంలో పసుపు, కుంకుమ పెట్టి నమస్కరించాలి. గోవుకు ఆహారం అందించడం, సేవ చేయడం వల్ల అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతారు.
ఏనుగు కుంభస్థలం (గజాననుడి పూజ): ఏనుగు కుంభస్థలంలో(ఏనుగు తల మీద ఉండే ఎత్తైన భాగం) లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అయితే నిజమైన ఏనుగును ప్రతిరోజూ పూజించడం సాధ్యం కాదు కాబట్టి, వినాయకుడిని ఆరాధించడం శ్రేష్ఠం. ఎవరైతే ప్రతిరోజూ గజాననుడిని భక్తితో పూజిస్తారో, వారికి గజలక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
బిల్వ పత్రాలు (మారేడు ఆకులు): శివుడికి ఇష్టమైన మారేడు చెట్టును లక్ష్మీదేవి స్వయంగా సృష్టించిందని పురాణాలు చెబుతున్నాయి. ఆ తల్లి స్వయంగా బిల్వ వృక్షం కింద తపస్సు చేసింది, అందుకే బిల్వ పత్రాలలో ఆమె నివాసం ఉంటుంది. ఈ పత్రాలతో శివుడిని పూజిస్తే, అటు శివానుగ్రహంతో పాటు ఇటు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది.
తామర పుష్పాలు (పద్మవాసిని): పద్మం లక్ష్మీదేవి జన్మస్థానం. అందుకే ఆమెను పద్మప్రియ అని పిలుస్తారు. తామర పువ్వుల మీద అమ్మవారు స్థిరంగా కొలువై ఉంటారు. లక్ష్మీ పూజలో తామర పువ్వులను సమర్పించడం వల్ల ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.
ముత్తైదువల పాపిట: వివాహిత స్త్రీలు తమ పాపిట మధ్యలో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన స్థానం. ఆ పాపిట భాగంలో కుంకుమ ధరించడం ఆ ఇంటికి శుభప్రదం. ఏ ఇల్లాలు అయితే నిత్యం కుంకుమ ధరిస్తుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండి భర్తకు, కుటుంబానికి ఐశ్వర్యం ప్రసాదిస్తుంది.
Goddess Lakshmi | లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో ఉండదంటే..
సంపదలు రావడమే కాదు, అవి మన దగ్గర నిలవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి..
- ఇల్లాలు కన్నీరు పెట్టుకునే ఇంట్లో, తులసి మొక్క లేని ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. శివుడిని, విష్ణువును ఆరాధించని వారు, ఏకాదశి వంటి పవిత్ర దినాలలో నియమాలు పాటించని వారి ఇంట్లో ఉండదు. ముఖ్యంగా సోమరితనం ఆవహించిన ఇళ్లలో దారిద్ర్యం తాండవిస్తుంది.
- ఈ పవిత్ర స్థానాలను భక్తితో గౌరవిస్తూ, ధర్మ బద్ధమైన జీవితం గడిపేవారిపై ఆ శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి.