అక్షరటుడే, వెబ్డెస్క్: Godavari | వారం రోజులుగా రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరికి వరద పోటెత్తింది. గోదావరి ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి (Godavari) నది ఉప్పొంగి ప్రవహిస్తుంది.
భద్రాచలంలో (Bhadrachalam) గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం రాత్రి గోదావరి నీటి మట్టం 48 అడుగులు కాగా.. గురువారం ఉదయానికి 51 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. నీటిమట్టం 53 అడుగులకు చేరితో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.
Godavari | నిలిచిపోయిన రాకపోకలు
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్ట్లు అన్ని నిండుకుండలా మారాయి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో గోదావరి ఉధృతంగా పారుతోంది. వరద పోటెత్తడంతో పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం వద్ద కల్యాణ కట్ట (Kalyana Katta) వరకు నీరు చేరింది. వరద నీరు పట్టణంలోకి రాకుండా అధికారులు గోదావరి కరకట్టకు ఉన్న స్లూయిజ్‌లను మూసివేశారు. ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Godavari | ధవళేశ్వరం వద్ద..
గోదావరి వరద పోటెత్తడంతో ధవళేశ్వరం(Dhavaleswaram) వద్ద పది లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు అవుతోంది. ఆనకట్ట వద్ద 11.75 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో అధికారులు 175 గేట్లను 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రాజమండ్రి పరిసర లంకల్లో నివసిస్తున్న 300 మంది మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లంక గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.