అక్షరటుడే, వెబ్‌డెస్క్: G Mail Users | జీ-మెయిల్ వినియోగదారులకు గూగుల్ (Google) శుభవార్త చెప్పింది. ఎంతో కాలంగా యూజర్లు ఎదురుచూస్తున్న ఒక కీలక ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై జీ-మెయిల్ యూజర్ ఐడీ (User ID) మార్చుకునే అవకాశం కలగనుంది.
పాత ఐడీతో సంతృప్తి చెందని వారికి ఇది పెద్ద ఉపశమనంగా మారనుంది.అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాలేదు. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఆప్షన్ కనిపిస్తున్నట్లు సమాచారం. పూర్తి స్థాయిలో అన్ని ఖాతాలకు ఈ సౌకర్యం రావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
G Mail Users | శుభవార్త
సాధారణంగా జీ-మెయిల్ ఖాతా సృష్టించే సమయంలో సరైన ఆలోచన లేకపోవడం, లేదా మనకు నచ్చిన పేర్లు అందుబాటులో లేకపోవడంతో చాలామంది ఏదో ఒక యూజర్ నేమ్‌తో మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుంటారు. తర్వాత ఆ ఐడీ మార్చుకునే అవకాశం లేకపోవడంతో, నచ్చకపోయినా అదే ఈ-మెయిల్ ఐడీని కొనసాగించాల్సి వస్తుంది. ముఖ్యంగా పాత డేటా, మెయిల్స్ కోల్పోవడం ఇష్టం లేక చాలామంది ఐడీ మార్పును ఆలోచించలేకపోయారు. ఇప్పుడీ సమస్యలకు గూగుల్ పరిష్కారం చూపింది. గూగుల్ సపోర్ట్ పేజీలో తాజాగా యూజర్ నేమ్ (Username) మార్చుకునే ఆప్షన్ కనిపించింది. ఇందులో @gmail.com భాగం అలాగే కొనసాగుతూ, ముందు ఉన్న యూజర్ నేమ్‌ను మాత్రమే మార్చుకునే వీలుంటుంది. ఐడీ మారినా కూడా ఖాతా పాత ఖాతాగానే కొనసాగుతుంది. అంటే డేటా, మెయిల్స్, సెట్టింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి.
అయితే ఈ ఫీచర్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకసారి ఐడీ మార్చుకున్న తర్వాత మళ్లీ మార్చుకోవడానికి ఏడాది పాటు వేచి ఉండాలి. ఒక ఖాతాకు గరిష్ఠంగా మూడుసార్లు మాత్రమే యూజర్ నేమ్ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే, జీ-మెయిల్ వినియోగదారులకు ఇది నిజంగా గేమ్ ఛేంజర్‌గా మారనుంది.