అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025’ పై రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ. హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారీ స్థాయిలో ప్రచారం చేసిన ఈ సమ్మిట్ పెట్టుబడులు రాబట్టడంలో విఫలమైందని, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.
హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ, “గ్లోబల్ సమ్మిట్ పేరుతో కట్టుకథలు, అంకెల గారడీ, చీకటి ఒప్పందాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ జరగలేదు. ఇది అభివృద్ధి సమ్మిట్ కాదు, రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా కనిపించింది” అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రవేశపెట్టిన ‘విజన్ డాక్యుమెంట్’ లో ఎలాంటి విజన్ లేకుండా అక్షరాలు, అంకెలు కలబోసి ‘విజన్‌లెస్ డాక్యుమెంట్’ అని విమర్శించారు.
Harish Rao | “సమ్మిట్ పెద్ద ఫ్లాప్ షో” – హరీశ్ రావు
గ్లోబల్ సమ్మిట్ (Global Summit)లో 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేలాది విదేశీ ప్రతినిధులు వస్తారని ప్రభుత్వం చెప్పినా, చివరకు ఒక్క ముఖ్యమంత్రి రాకపోవడం, అంతర్జాతీయ ప్రమాణాలకు సమ్మిట్ అందకుండా ప్రభుత్వం పరువు పోగొట్టుకుందని హరీశ్ ఆరోపించారు. “చివరకు ఎంబీఏ విద్యార్థులు, కాంగ్రెస్ కార్యకర్తలను కోట్లు వేయించి కూర్చోబెట్టడం తప్ప పెద్దగా ఎవరు హాజరు లేదు. ఇది గ్లోబల్ సమ్మిట్ కాదు, లోకల్ పొలిటికల్ షో” అని మండిపడ్డారు. రెండేళ్లుగా విదేశీ పర్యటన పేరుతో ముఖ్యమంత్రి, మంత్రులు కోట్ల ఖర్చు చేసినా, ఫలితాలు ఏమీ కనిపించలేదని హరీశ్ ప్రశ్నించారు. దావోస్‌లో చెప్పిన 40,232 కోట్లు,2024లో జరిగిన ఏఐ సమ్మిట్‌లో ప్రకటించిన ఒప్పందాలు,2025 దావోస్ సమ్మిట్‌లో చెప్పిన 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు, చెప్పిన 49,550 ఉద్యోగాలుఇవి అన్నీ కాగితాల మీదే మిగిలిపోయాయని విమర్శించారు.
“దమ్ముంటే ఈ పెట్టుబడుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలి” అని ఆయన రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ఫార్మాసిటీ పక్కనున్న భూములన్నీ ముందుగానే బినామీలతో కొనిపించి, ఆ తర్వాత ఫ్యూచర్ సిటీ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి, ఆ భూముల విలువ పెంచే ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వేసిందని ఆరోపించారు. “పెట్టుబడులు కాదు, ఇవన్నీ రియల్ ఎస్టేట్ స్కాం. ఫార్మా కంపెనీలు కూడా ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్నాయి” అని తీవ్ర విమర్శలు చేశారు. సమ్మిట్ వేదికపైనే బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ..కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి జరిగిందని వివరించారు. కేసీఆర్ (KCR) పదేళ్ళ పాలన గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ రెడ్డి విధానాలు పరిశ్రమలను తరిమేస్తున్నాయని, అభివృద్ధి ఆగిపోతుందని, కేసీఆర్ తీసుకొచ్చిన వృద్ధిని ప్రభుత్వం కొల్లగొడుతోందని హరీశ్ ఖండించారు.