అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | పెళ్లికి ఒప్పుకోలేదని బాలికను దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. సొంత మేనమరదలిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
నగరంలోని ముషీరాబాద్ (Musheerabad) డివిజన్ బౌద్ధనగర్ పరిధిలో కాంతారావు, లక్ష్మీ దంపతులు నివసిస్తున్నారు. వారికి కూతురు పవిత్ర (17) ఉంది. ఆమె మేనబావ ఉమాశంకర్ పవిత్రను ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. అయితే అతడు మద్యానికి బానిసగా మారడంతో పెళ్లికి పవిత్ర నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకొని సోమవారం మధ్యాహ్నం పవిత్ర ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వచ్చాడు. అనంతరం కత్తితో దాడి చేసి బాలికను హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
Hyderabad | నిందితుడి కోసం గాలింపు
పట్టపగలు హత్య జరగడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వంట గదిలోని చాకుతో హత్య చేసినట్లు గుర్తించారు. ఘటన స్థలంలో ఉమాశంకర్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారసిగూడ పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. టైల్స్ పని చేసే ఉమా శంకర్ తాగుబోతు కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదని పవిత్ర తల్లిదండ్రులు చెప్పారు. దీంతో కక్ష పెంచుకొని తమ కూతురిని పొట్టన పెట్టుకున్నాడని రోదించారు. కాగా నగరంలో వరుస హత్యలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. సోమవారం ఉదయం ఓ రియాల్టర్ను నడిరోడ్డుపై దుండగులు గన్తో కాల్చి, కత్తులతో పొడిచి చంపారు.