అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India Team | ఆసియా కప్ 2025 ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు విండీస్ పర్యటనకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్(Shubhman Gill) టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.
ఇంగ్లాండ్ టూర్లో కూడా గిల్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కె.ఎల్. రాహుల్ నిలవగా, వన్‌డౌన్‌లో సాయి సుదర్శన్ తన స్థానాన్ని కొనసాగించనున్నాడు. గతంలో త్రిబుల్ సెంచరీ చేసినప్పటికీ మొన్నటి సిరీస్‌లో సరిగ్గా రాణించలేకపోయిన కరుణ్ నాయర్ మరోసారి జట్టులో చోటు కోల్పోయాడు. అతడి స్థానంలో యువ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు.
India Team | వారికి మొండి చేయి..
ఇంగ్లాండ్ టూర్లో గాయపడ్డ రిషబ్ పంత్ ఇంకా కోలుకోకపోవడంతో, ధ్రువ్ జురేల్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎన్. జగదీశన్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా కొనసాగనున్నాడు. స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. నితీశ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్‌గా తన స్థానం నిలబెట్టుకున్నాడు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి మరోసారి జట్టులో చోటు దక్కలేదు. ఆసియా కప్(Asia Cup)కు ఎంపిక కాకపోవడం పట్ల ఇప్పటికే నిరాశను వ్యక్తం చేసిన షమీ, టెస్టు జట్టులోకి రావడం కూడా ఈ సిరీస్‌లో సాధ్యపడలేదు.యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గాయం కారణంగా ఈ సిరీస్‌కి ఎంపిక కాకపోయినట్లు సెలక్టర్లు వెల్లడించారు.
టెస్టు మ్యాచ్‌ల షెడ్యూల్
మొదటి టెస్టు : అక్టోబర్ 2 – అహ్మదాబాద్
రెండో టెస్టు : అక్టోబర్ 10 – ఢిల్లీ (అరుణ్ జైట్లీ స్టేడియం)
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కి భారత జట్టు ఇదే: యశస్వి జైస్వాల్, కె ఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్
ఈ రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా(Team India) యువ ఆటగాళ్ల ప్రతిభను పరీక్షించుకోనుంది. వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్ట్యా ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది.