అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gig workers | భారతదేశంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్, ఈ-కామర్స్ రంగాల్లో (e-commerce sectors) పనిచేసే గిగ్ వర్కర్లు తమ హక్కుల సాధన కోసం మరోసారి సమ్మెబాట పట్టారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూ) ఆధ్వర్యంలో డిసెంబర్ 31న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌ల డెలివరీ సేవలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
Gig workers | క్రిస్మస్ రోజు కూడా..
గిగ్ వర్కర్లు డిసెంబర్ 25న క్రిస్మస్ (Christmas Day) సందర్భంగా కూడా ఫ్లాష్ స్ట్రైక్ నిర్వహించారు. దాదాపు 40 వేల మంది కార్మికులు ఇందులో పాల్గొన్నారు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో డెలివరీ సేవల్లో 50 నుంచి 60 శాతం వరకు అంతరాయం ఏర్పడింది. కాగా.. నూతన సంవత్సర వేడుకల (New Year celebrations) సమయంలో మరోసారి సమ్మె చేపట్టడం ద్వారా కార్మికులు తమ డిమాండ్లపై సంస్థలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
Gig workers | ప్రధాన సమస్యలివే..
డెలివరీ ప్లాట్‌ఫాంలు ’10 నిమిషాల డెలివరీ’ వంటి మోడళ్లను అమలు చేస్తున్నాయి. ఇవి కార్మికులపై అధిక ఒత్తిడి, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాన్ని పెంచుతున్నాయి. అంతేకాకుండా.. సంపాదనలో నిరంతర తగ్గుదల, ఎక్కువ గంటల పని, ఐడీల అకారణ బ్లాకింగ్, ఉద్యోగ భద్రత లేకపోవడం, సామాజిక భద్రతా ప్రయోజనాలు (ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పింఛన్) అందకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Gig workers | డెలివరీ ప్లాట్‌ఫాంలపై ఎఫెక్ట్
కొత్త సంవత్సరం వేళ ఫుడ్ డెలివరీల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అయితే గిగ్ వర్కర్ల సమ్మెతో డెలివరీ ప్లాట్‌ఫాంలపై తీవ్ర ప్రభావం పడనుంది. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లపై ఎఫెక్ట్ కానుంది. ఈ సమ్మె పండుగ సీజన్లో జరగడంతో వినియోగదారులపై కూడా ప్రభావం పడనుంది.