అక్షరటుడే, వెబ్‌డెస్క్: GHMC Wards | జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసులో కూర్చుండి వార్డులను విభజించారని ఆరోపించారు. సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissioner)కు వినతిపత్రం అందించారు.
హైదరాబాద్ (Hyderabad) నగర పాలక సంస్థ పరిధిని ఇటీవల ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. అనంతరం 150 వార్డులను 300కు పెంచింది. దీనిపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. అభ్యంతరాలపై మంగళవారం కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. ఈ క్రమంలో వార్డుల విభజనపై భారీగా అభ్యంతరాలు వచ్చాయి. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs)సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలిసి వినతి పత్రం అందించారు.
GHMC Wards | ఇష్టానుసారంగా..
ఆఫీస్‌లో కూర్చొని 300 డివిజన్లు చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వానికి ఎందుకు అంత తొందరపాటు అని ప్రశ్నించారు. మంగళవారం జరిగే కౌన్సిల్ సమావేశంలో పార్టీ వాదన వినిపిస్తామన్నారు. ఫ్లెక్సీల విషయంలో రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ.. ఇష్టానుసారం వార్డులు పెంచారన్నారు. రాజ్యాంగబద్ధంగా వెళ్లకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తమ అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో మేడ్చల్ రూరల్‌గా ఉందని మాజీ మంత్రి మల్లారెడ్డి (Former Minister Mallareddy) అన్నారు. ఇంకా అక్కడ అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. ఎక్కడో బంజారాహిల్స్లా కీసర ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. కాగా ఆదివారం వరకు వార్డుల విభజనపై 1,328 అభ్యంతరాలు వచ్చాయి. ఆదివారం ఒక్కరోజు 227 అభ్యంతరాలు రావడం గమనార్హం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో సైతం అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు.