అక్షరటుడే, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad)ను భారీ వర్షాలు (Heavy rains) ముంచెత్తుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా వర్షాలు ఎడతెరపిలేకుండా కురుస్తూనే ఉన్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం వల్ల నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఎల్బీ నగర్, హయత్ నగర్, ఖైరతాబాద్, వనస్థలిపురం, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, మూసాపేట్, బాలానగర్, కూకట్పల్లి, ప్రగతినగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, మెహదీపట్నం, మియాపూర్, చందానగర్, అబ్దుల్లాపూర్మేట్, గండిమైసమ్మ, పెద్ద అంబర్పేట్, చైతన్యపురి, దిల్సుఖ్నగర్, కొత్తపేట, నాచారం తార్నాక, సరూర్ నగర్, నల్లకుంట హబ్సిగూడ, వారణాసిగూడ, బేగంపేట్, కంటోన్మెంట్, మారేడుపల్లి, హియాయత్‌నగర్, నాంపల్లి, లక్డీకాపూల్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
GHMC Floods | వర్షం పడితే అంతే..
గ్రేటర్ సిటీలో చిన్నపాటి వర్షం పడినా కరెంటు కోతలు ఉంటున్నాయి. ఇక భారీ వర్షా లు పడితే అంతే సంగతులు.. గంటల తరబడి కోతలు విధిస్తున్నారు. ఫలితంగా నగర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.
GHMC Floods | లోతట్టు ప్రాంతాల్లో కష్టాలు..
నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునుగుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉన్నాయనేది బహిరంగ రహస్యం. చెరువులను ఆనుకుని, నాలాలు కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపట్టడంతో వరద నీటి ప్రవాహానికి మార్గం లేకుండా పోతోంది.
ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగే దుస్థితి ఏర్పడుతోంది. ప్రగతినగర్ చెరువు వద్ద నిర్మాణాలకు ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటోంది. బఫర్‌జోన్ పరిధిలో అనుమతి లేకుండా భారీ నిర్మాణాలు చేపట్టారు ఇక్కడ. మున్సిపాలిటీ అధికారుల అవినీతి అనుమతులకు నిలువెత్తు సాక్ష్యాలుగా ఇవి ఉన్నాయి.
సాధారణంగా ఒక బహుల అంతస్తుల భవనం నిర్మించాలంటే.. కనీసం 1200 గజాలు అవసరం. కానీ, నిజాంపేట్, ప్రగతినగర్, సింహపురి కాలనీ, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, గండిమైసమ్మ తదితర ప్రాంతాల్లో సింహభాగం నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం గమనార్హం.
ఇక ప్రగతినగర్ చెరువు వద్ద చేపట్టిన నిర్మాణాలను పరిశీలిస్తే.. చిన్నపాటి వర్షానికే సెల్లార్లోకి నీరు చేరుతోంది. ఇక డ్రెయినేజీ వాటర్ రివర్స్ అయి అపార్టుమెంట్లలోకి భారీగా మురుగు తన్నుకొస్తోంది. అప్పట్లో అడ్డగోలుగా నిర్మాణాలకు అనుమతి ఇవ్వడంతో బిల్డర్లు ఇష్టారీతిన కడుతూ విక్రయించుకున్నారు. ఇప్పడేమో వాటిల్లో ఉన్నవారు ఇబ్బంది పడాల్సి వస్తోంది.
ఇక ప్రధాన రహదారుల పరిస్థితి కూడా అలాగే ఉంటోంది. ఎత్తు పల్లాలను అంచనా వేయకుండా చేపట్టే నిర్మాణాలు ఇందుకు కారణం అవుతున్నాయి. భారీగా నిలిచే నీటిని తొలగించేందుకు రోడ్లపై గుంతలు తవ్వుతున్నారు. దీనివల్ల రోడ్లు ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్యకు కారణం అవుతున్నాయి.
GHMC Floods | ట్రాఫిక్ కష్టాలు..
వర్షం పడిన ప్రతీసారి మహానగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ పెద్ద సమస్యగా మారుతోంది. నిన్న కురిసిన వర్షాలతో కిలో మీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. చాదర్ ఘాట్ నుంచి ఎల్బీ నగర్ వరకు ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడం గమనార్హం. ఇక హైటెక్ సిటీ ప్రాంతం నుంచి జేఎన్టీయూ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. జేఎన్టీయూ వద్ద అయితే మరీ ఇబ్బందిగా మారుతోంది. ప్రగతినగర్ చెరువు వద్ద సైతం ఇదే సమస్య ఉత్పన్నం అవుతోంది. అటు కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు పెద్ద మొత్తంలో వాహనాలు నిలిచి, అడుగు కూడా ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. కొండాపూర్ బయోడైవర్శిటీ, మాదాపూర్ మార్గంలో ట్రాఫిక్ జామ్ కారణంగా వాహన దారులకు ఇబ్బందులు తప్పలేదు.