అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GHMC Division Three Corporations | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరబాద్‌ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది.
జీహెచ్ఎంసీని విభజిస్తామని కొంతకాలంగా ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవల పోలీస్ కమిషనరేట్లను (Police Commissionerates) సైతం పునర్విభజించింది. తాజాగా జీహెచ్ఎంసీని సైబరాబాద్, మల్కాజ్గిరి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. ఇటీవల ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధి పెంచింది. నగర శివారులోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. అనంతరం వార్డుల సంఖ్యను సైతం పెంచింది. గతంలో జీహెచ్ఎంసీలో 150 వార్డులు ఉండగా.. 300 చేసింది. అయితే శివారు మున్సిపాలిటీల విలీనంపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. పరిపాలన వికేంద్రీకరణ చేపట్టాలని, ఇలా దూరంగా ఉన్న ప్రాంతాలను జీహెచ్ఎంసీ విలీనం చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం జీహెచ్ఎంసీని విభజించడం గమనార్హం.
GHMC Division Three Corporations | కొత్త కార్పొరేషన్ల వివరాలు
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Cyberabad Municipal Corporation)లో శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు ఉంటాయి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లు ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో గతంలోని జోన్లు కొనసాగనుండగా.. పలు జోన్లు కొత్త కార్పొరేషన్లలోకి వెళ్లాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
GHMC Division Three Corporations | కమిషనర్ల నియామకం
కొత్త కార్పొరేషన్లకు ప్రభుత్వం కమిషనర్లను సైతం నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ (GHMC Commissioner RV Karnan)ను కొనసాగించింది. సైబరాబాద్‌కు శ్రీజనను, మల్కాజ్గిరి వినయ్ కృష్ణారెడ్డి (Vinay Krishna Reddy)ని కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌ను నియమించింది.