అక్షరటుడే, వెబ్‌డెస్క్: South Korea | పెళ్లి చేసుకోండి.. పిల్లలు కనండి అంటూ ఇప్పుడు కొన్ని దేశాల ప్రభుత్వాలే స్వయంగా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. అంతేకాదు, డేటింగ్‌కు వెళ్తే నగదు ఇస్తామని, వివాహం చేసుకుంటే రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు బంపర్ ఆఫర్లు అందిస్తామని ప్రకటిస్తున్నాయి.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ఆయా దేశాల్లో యువత పెళ్లి, పిల్లల విషయంలో ఆసక్తి చూపకపోవడంతో జనన రేటు తీవ్రంగా పడిపోతోంది. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వాలు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టాయి. ప్రపంచంలోనే అత్యల్ప జనన రేటు ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. అక్కడి బర్త్ రేట్ 0.72కి పడిపోవడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. భవిష్యత్తులో జనాభా తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందన్న అంచనాతో యువతను ప్రేమ, పెళ్లి, కుటుంబ జీవితం వైపు మళ్లించేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. దక్షిణ కొరియాలోని బుసాన్ (Busan) వంటి నగరాల్లో ఈ స్కీమ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
South Korea | డేటింగ్ చేస్తే..
ఈ పథకాల ప్రకారం యువకుడు, యువతి డేటింగ్ (Dating)కు వెళ్లాలనుకుంటే వారి ఖర్చుల కోసం ప్రభుత్వం సుమారు రూ.30 వేల నుంచి రూ.31 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ డబ్బుతో వారు కలిసి భోజనం చేయడం, సినిమా చూడటం లేదా చిన్న ట్రిప్‌కు వెళ్లడం వంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు. యువత ఒంటరిగా ఉండటాన్ని తగ్గించి, సామాజిక సంబంధాలు పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. డేటింగ్ తర్వాత ఆ జంట వివాహానికి సిద్ధమైతే ప్రభుత్వం మరింత పెద్ద ఆఫర్ ప్రకటిస్తోంది. పెళ్లి ఖర్చులు, గృహ వసతి కోసం ఒక్కో జంటకు రూ.25 లక్షల నుంచి రూ.31 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. అంతేకాదు, పెళ్లికి ముందు ఇరు కుటుంబాల సభ్యులు కలుసుకునే ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తోంది. ఈ స్కీమ్స్‌ను ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేస్తున్నారు. 24 నుంచి 43 ఏళ్ల లోపు యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలు, డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత అర్హులను ఎంపిక చేస్తారు.
దక్షిణ కొరియాతో పాటు జపాన్, ఇటలీ, చైనా, రష్యా, హంగేరీ వంటి దేశాలు కూడా జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ కారణంగా అక్కడి ప్రభుత్వాలు పెళ్లి, పిల్లలపై ప్రత్యేక ప్రోత్సాహక పథకాలను (Special Incentive Schemes) అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో పిల్లలు కంటే ట్యాక్స్ మినహాయింపులు, ఉచిత విద్య, గృహ రుణాలపై సబ్సిడీలు కూడా అందిస్తున్నారు. ఇక భారతదేశం విషయానికి వస్తే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో రాజకీయ, ఆర్థిక ప్రాముఖ్యత తగ్గే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది పిల్లలను కనేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.