Homeక్రీడలుGautam Gambhir | గంభీర్ మార్క్ ప్ర‌క్షాళ‌న‌.. పదేళ్లుగా జట్టుతో ఉన్న వ్య‌క్తిపై వేటు

Gautam Gambhir | గంభీర్ మార్క్ ప్ర‌క్షాళ‌న‌.. పదేళ్లుగా జట్టుతో ఉన్న వ్య‌క్తిపై వేటు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gautam Gambhir | భారత క్రికెట్ జట్టులో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సహాయక సిబ్బందిలో భారీ మార్పులు జరుగుతున్నాయి. ఈ పరిణామాల్లో భాగంగా జట్టుతో దశాబ్దకాలంగా కొనసాగిన మసాజర్ రాజీవ్ కుమార్​ను బీసీసీఐ (BCCI) తొలగించింది.

ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటన వరకు టీమ్‌ఇండియాతో (Team India) ఉన్న ఆయన కాంట్రాక్టును ఇకపై కొనసాగించకూడదని బోర్డు స్పష్టంగా నిర్ణయించింది. ఇదివరకు బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్​లను (Soham Desai) కూడా తప్పించిన బీసీసీఐ, ఇప్పుడు రాజీవ్‌ కుమార్​కు (Rajiv Kumar) కూడా సెండాఫ్ ఇచ్చింది. ఈ మార్పులన్నీ గంభీర్ కొత్త దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Gautam Gambhir | భారీ మార్పులు..

ఆయన టీమ్‌ఇండియాను తన శైలిలో తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా పాత సహాయక సిబ్బందిని తొలగిస్తూ, కొత్త వారిని నియమిస్తున్నారు. టీమ్ మేనేజ్‌మెంట్‌లోని (Team Management) ఓ కీలక వ్యక్తి ప్రకారం, సహాయక సిబ్బంది జట్టుతో ఎక్కువకాలం కొనసాగితే ఆటగాళ్లతో స‌న్నిహిత‌ సంబంధాలు ఏర్పడి, అది పర్ఫార్మెన్స్‌పై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. అందుకే టీమ్‌ను కొత్త దిశగా నడిపించేందుకు పాత వారిని క్రమంగా తొలగిస్తున్నారు. గతంలో ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్​ను తొలగించినప్పటికీ, ఇంగ్లండ్ పర్యటనకు ముందు మళ్లీ నియమించిన సంగతి తెలిసిందే. అయితే రాబోయే ఆసియా కప్‌కు ఆయన్ని కొనసాగిస్తారా లేదా అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు.

ఇకపోతే, గంభీర్ నాయకత్వంలోని టీమ్‌ఇండియా సహాయక బృందం వివరాలు..

టీమిండియా ప్రస్తుత సపోర్ట్ స్టాఫ్:

  • ప్రధాన కోచ్: గౌతమ్ గంభీర్
  • అసిస్టెంట్ కోచ్ / ఫీల్డింగ్ కోచ్: ర్యాన్ టెన్ డోస్చేట్
  • బ్యాటింగ్ కోచ్: సితాన్షు కోటక్
  • బౌలింగ్ కోచ్: మోర్నే మోర్కెల్
  • స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్: అడ్రియన్ లె రౌక్స్
  • ఫీల్డింగ్ కోచ్: టి. దిలీప్
  • త్రోడౌన్ స్పెషలిస్ట్: రఘు (రాఘవేంద్ర ద్వివేది)
  • లాజిస్టిక్స్ మేనేజర్: ఉపాధ్యాయ
  • వీడియో విశ్లేషకుడు: హరి

మొత్తానికి గంభీర్ రాకతో టీమ్‌ఇండియాఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టే కనిపిస్తోంది. రాబోయే ఆసియా కప్, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, వన్డే సిరీస్‌ల్లో ఈ మార్పులు ఎంత వరకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయో వేచి చూడాలి.