అక్షరటుడే, ఇందూరు : Nizamabad Municipal | నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో చెత్త సేకరణ ప్రక్రియ పూర్తిస్థాయి జరగడంలేదు. పలు కాలనీల్లో నిత్యం చెత్త సేకరణ వాహనాలు తిరుగుతున్నా.. మరికొన్ని చోట్ల రెండు రోజుల కొకసారి కూడా రావడంలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోనే చెత్త పేరుకుపోతుండడంతో దోమలు వ్యాప్తి చెంది రోగాలు వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు.
నిజామాబాద్ నగరపాలక సంస్థ (Nizamabad Municipal Corporation) పరిధిలో రెండు లక్షలకు పైగా కుటుంబాలు నివసిస్తాయి. అయితే పలు ప్రాంతాల్లో చెత్త సేకరణ గాడితప్పింది. కాలనీల ప్రజలు చెత్త బండి (garbage truck) కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల రెండు మూడు రోజులకోసారైనా రావడంలేదని వాపోతున్నారు. మరోవైపు చెత్త బయట వేస్తే జరిమానా విధిస్తామని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఏమీ చేయలేక ఇంట్లోనే చెత్తను ఉంచాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
Nizamabad Municipal | వర్షాకాలం ఇబ్బందులు..
ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా రోజుల తరబడి ఇంట్లో చెత్త పేరుకుపోతే దోమల బెడద ఎక్కువవుతుంది. దీంతో డెంగీ (dengue), మలేరియా (malaria), టైఫాయిడ్ (typhoid) లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు ఆరోగ్యశాఖ ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని సూచిస్తుంది. అంటే చెత్తా చెదారం, వ్యర్థాలు, నిల్వ నీరు లేకుండా చూడాలి. కానీ చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడంతో కొందరికి సమస్యలు తెచ్చిపెడుతోంది.
Nizamabad Municipal | మొత్తం 156 వాహనాలు..
నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 90 శాతం ఇళ్లలో చెత్త సేకరణ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 60శాతం కూడా జరగడం లేదని తెలిసింది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 156 చెత్త సేకరణ వాహనాలు (garbage collection vehicles) (ఆటోలు) ఉన్నాయి. ఇందులో 131 రెగ్యులర్ ఆటోలు, 25 ఓనర్ కం డ్రైవర్ (ఓసీడీ) ఆటోలు ఉ న్నాయి. చాలా డివిజన్లలో ఓసీడీ ఆటోలు రోజు విడిచి రోజు, కొన్ని కాలనీలోనైతే రెండు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నట్లు తెలిసింది.
Nizamabad Municipal | రెగ్యులర్గా చెత్త సేకరణ
– సోలమన్ రాజు, నగర పాలక సంస్థ, వెహికల్స్ ఇన్ఛార్జి
నిజామాబాద్ పరిధిలో చెత్త సేకరణ నిత్యం కొనసాగిస్తున్నాం. ఎక్కడైనా ఫిర్యాదులు అందితే వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తున్నాం. కొన్ని డివిజన్లలో ఓసీడీ ఆటోలు రోజు విడిచి మరొక రోజు వెళ్తున్నాయి. అక్కడ కూడా రెగ్యులర్ గా వెళ్లేలా చూస్తాం.