అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sourav Ganguly | భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మరోసారి క్రికెట్ పరిపాలనలోకి అడుగుపెట్టాడు. ఆరు సంవత్సరాల విరామం తర్వాత గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (Cricket Association of Bengal) అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాడు.
సోమవారం జరిగిన క్యాబ్ 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గంగూలీ ఇప్పటికే 2015 నుండి 2019 వరకు ఈ పదవిలో పని చేశారు. ఆ తరువాత బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన, తాజాగా మళ్లీ బెంగాల్ క్రికెట్ పరిపాలన బాధ్యతలు చేపట్టారు. ఈసారి ఆయన తన అన్న, మాజీ అధ్యక్షుడు స్నేహశీష్ గంగూలీ స్థానాన్ని భర్తీ చేశారు. స్నేహశీష్ ఆరు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసి తప్పుకున్నారు.
Sourav Ganguly | పిచ్‌లు సిద్ధంగా ఉన్నాయి
గంగూలీకి CAB అధ్యక్షుడిగా తొలి ప్రధాన బాధ్యతగా నవంబర్ 2025లో ఈడెన్ గార్డెన్స్(Eden Gardens) వేదికగా జరగబోయే భారత్ – దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ ఏర్పాట్లను పర్యవేక్షించడం ఉంటుంది. ఇది 2019లో భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన చారిత్రాత్మక డే-నైట్ టెస్ట్ తర్వాత ఈ మైదానంలో జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఇటీవల మీడియాతో మాట్లాడిన గంగూలీ(Sourav Ganguly), ఈడెన్ గార్డెన్స్‌లోని గదుల సామర్థ్యాన్ని లక్ష మందికి పైగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. “ఇది పూర్తైతే..నరేంద్ర మోదీ స్టేడియం తర్వాత దేశంలో రెండో అతిపెద్ద స్టేడియంగా ఈడెన్ నిలుస్తుంది,” అని పేర్కొన్నారు. అయితే, ఈ మార్పులు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాతే అమల్లోకి వస్తాయని చెప్పారు.
గంగూలీ మాట్లాడుతూ, “వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌లో ముఖ్యమైన మ్యాచ్‌లు ఈడెన్ గార్డెన్స్‌లో జరగాలి అనే దిశగా నేను ప్రయత్నిస్తాను. పిచ్‌లు సిద్ధంగా ఉన్నాయి, మౌలిక సదుపాయాలు మెరుగైనవిగా ఉన్నాయి. సరైన నిర్వహణ ఉంటే, ఇది ఒక గొప్ప వేదిక అవుతుంది,” అని తెలిపారు.ఇటీవల ప్రిటోరియా క్యాపిటల్స్‌కు హెడ్ కోచ్‌గా నియమితులైన గంగూలీ, బీసీసీఐకి కొత్తగా ఎన్నికైన మిథున్ మన్హాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రఘురామ్ భట్ వంటి ఇతర కొత్త సభ్యులతో కలిసి బోర్డు బాగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 28న ముంబైలో జరిగే బీసీసీఐ వార్షిక సమావేశానికి CAB తరఫున హాజరుకానున్నారు.