అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anmol Bishnoi | ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో (Siddique murder case) వాంటెడ్, గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ను ఎన్ఐఏ అధికారులు బుధవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు హాజరు పరిచారు. కోర్టు అతడికి 11 రోజుల కస్టడీకి అనుమతించింది.
జైలు నుంచి క్రిమినల్ సిండికేట్‌ను నడుపుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (gangster Lawrence Bishnoi) తమ్ముడు అన్మోల్. ఎన్సీపీ నేత, సల్మాన్ ఖాన్ స్నేహితుడు సిద్దిఖీ హత్య కేసులో అతడు కీలక నిందితుడిగా ఉన్నాడు. అయితే అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. కాగా ఇటీవల అమెరికాలో అన్మోల్ను (Anmol Bishnoi) అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా (America) నుంచి తీసుకువచ్చారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత అతన్ని అధికారికంగా NIAకి అప్పగించారు. అతని అన్నయ్య లారెన్స్ బిష్ణోయ్‌తో ముడిపడి ఉన్న ప్రధాన నేరాలు, దోపిడీ నెట్‌వర్క్‌లలో అతని ప్రమేయం ఉందని ఆరోపిస్తూ దేశంలోని అనేక ప్రాంతాలలో అతను వాంటెడ్‌లో ఉన్నాడు.
Anmol Bishnoi | కస్టడీకి అనుమతి
ఎన్ఐఏ బిష్ణోయ్‌ను పాటియాలా హౌస్ కోర్టులో (Patiala House Court) హాజరు పరిచింది. 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే కోర్టు 11 రోజుల కస్టడీకి అనుమతించింది. న్యాయవాది కుష్‌దీప్ గౌర్‌తో కలిసి NIA తరపున హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహుల్ త్యాగి, బిష్ణోయ్ క్రైమ్ సిండికేట్‌లో అన్మోల్ అనుమానిత పాత్రను కోర్టులో వివరించారు. ఈ నెట్‌వర్క్‌లో కీలక సభ్యుడు అన్మోల్ 2022 నుంచి పరారీలో ఉన్నాడు.
లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని గ్యాంగ్‌స్టర్ సిండికేట్‌కు సంబంధించి అరెస్టు అయిన 19వ నిందితుడు అన్మోల్. ఈ గ్రూప్ నెట్వర్క్ వెలికితీసేందుకు కస్టోడియల్ విచారణ అవసరమని NIA తెలిపింది. నిధుల మూలాన్ని గుర్తించడానికి, ఇతర సభ్యులను గుర్తించడానికి, సిండికేట్ (syndicate) ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి బిష్ణోయ్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది.
Anmol Bishnoi | అనేక కేసులు
రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్రలలో గ్యాంగ్‌స్టర్ అన్మోల్‌పై 31 కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ స్టేట్స్, కెనడా (United States and Canada) మధ్య తరచుగా ప్రయాణించే బిష్ణోయ్‌ను యూఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020– 23 మధ్య దేశం అంతటా ఉగ్రవాద కార్యకలాపాలకు దోహదపడటంలో అతని ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. 2023లో NIA అతనిపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఏజెన్సీ ప్రకారం, అతను అంతర్జాతీయంగా గుర్తించబడిన ఉగ్రవాది గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లతో కలిసి పనిచేశాడు. తాజాగా అతడి కస్టడీతో బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధించిన కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
