అక్షరటుడే, వెబ్డెస్క్ : Fake certificates | రాష్ట్రంలో కొందరు నకిలీ సర్టిఫికెట్ల దందా చేస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఏళ్ల పాటు చదవాల్సిన అవసరం లేకుండా కావాల్సిన సర్టిఫికెట్లను క్షణాల్లో తయారు చేసి ఇస్తున్నారు. తాజాగా మాదాపూర్ ఎస్‌వోటీ (SOT) పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల ముఠాను అరెస్ట్ చేశారు.
గచ్చిబౌలి (Gachibowli) ఇందిరానగర్‌లో జిరాక్స్ సెంటర్‌లో నకిలీ సర్టిఫికెట్ల దందా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేయించుకున్న ఏడుగురిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో నకిలీ సర్టిఫికెట్ల దందా జోరుగా సాగుతోంది. ప్రైవేట్ ఉద్యోగాలు, విదేశాలకు వెళ్లే వారు ఎక్కువగా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేయించుకుంటున్నట్లు సమాచారం.
Fake certificates | గతంలో సైతం
హైదరాబాద్ (Hyderabad)లోని కూకట్‌పల్లిలో నకిలీ సర్టిఫికెట్ ముఠాను శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు జులైలో అరెస్ట్ చేశారు. హరీశ్, మహేష్ అనే నిందితులను పట్టుకున్నారు. వీరు 46 మందికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు గుర్తించారు. వాటితో 24 మంది విదేశాలకు వెళ్లడం గమనార్హం. వరంగల్ (Warangal)లో సైతం ఫేక్ సర్టిఫికెట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. దొరికిన నిందితుల్లో పలువురు ఆర్టీఏ ఏజెంట్లుగా చెలామణి అవుతున్న వారు కూడా ఉన్నారు.
