అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Vinayaka Chavithi | గణేష్ మండళ్ల (Ganesh mandals) నిర్వాహకులు నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గణేష్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజల నుండి డబ్బులను బలవంతంగా వసూలు చేయరాదన్నారు. గణేష్ మండపాలను ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రదేశాల్లోనే నెలకొల్పాలని స్పష్టం చేశారు.
మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారికి సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. గణేష్ మండళ్ల వద్ద సందర్శించే మహిళలపై, యువతులపై ఈవ్ టీజింగ్ జరుగకుండా మండళ్ల నిర్వాహకులు చూసుకోవాలని పేర్కొన్నారు. డీజే(DJ), డీజే మిక్సర్స్ (DJ Mixers) విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఆస్పత్రుల వద్ద.. పాఠశాలల వద్ద భారీ శబ్దంతో పాటలు పెట్టవద్దని సీపీ వెల్లడించారు. రాత్రి 10 దాటిన తర్వాత లౌడ్ స్పీకర్లు (Loudspeakers) ఆఫ్ చేయాలని, ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు.
Vinayaka Chavithi | డీజేలు పూర్తిగా నిషిద్ధం..
వేడుకల్లో డీజేలు పూర్తిగా నిషిద్ధమని.. మైక్ పర్మిషన్ కోసం సైతం ఏసీపీని సంప్రదించి పర్మిషన్ తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు. మండపాళ్లలో విద్యుత్ సరఫరా కోసం నాణ్యమైన విద్యుత్ తీగలను వాడాలని.. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు గాని పోలీస్ కంట్రోల్ రూం 87126- 59700కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ప్రతి గణేష్ మండలి వద్ద ఉదయం, రాత్రి వేళల్లో ఇద్దరూ లేదా ముగ్గురికి తక్కువ కాకుండా తమ కమిటీ మెంబర్లు గణేష్ మండలిలో అందుబాటులో ఉండాలని సీపీ స్పష్టం చేశారు. ప్రతి గణేష్ మండలి వద్ద విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Vinayaka Chavithi | మండళ్ల వద్ద అపరిచిత వ్యక్తులు కనిపిస్తే..
గణేష్ మండపాల వద్ద అనుమానిత వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు వదిలినట్లయితే వాటిని తాకవద్దని దగ్గర్లోని పోలీస్ అధికారులకు తెలపాలని కోరారు. గణేష్ విగ్రహాన్ని నిమజ్జన నిమిత్తం తీసుకెళ్లే మార్గాన్ని ముందుగానే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో అందజేయాలని సూచించారు.
Vinayaka Chavithi | వేదికలు బలంగా ఉండాలి..
గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో షెడ్‌ను నాణ్యతతో నిర్మించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. పైభాగంపై రేకులు, ప్లాస్టిక్ కవర్లను ఏర్పాటు చేయాలని.. వర్షానికి ప్రతిమలు తడవకుండా చూసుకోవాలని వెల్లడించారు. గణేష్ మండలి వద్ద పూజా కార్యక్రమంలో క్యూ పద్ధతి పాటించాలని విధిగా బారికేడ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.
Vinayaka Chavithi | యువకులు సమయమనం పాటించాలి
యువకులు కోపతాపాలకు వెళ్లకుండా సంయమనం పాటించాలని సీపీ పేర్కొన్నారు. ఎటువంటి పుకార్లను నమ్మవద్దని.. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా నిరంతర పోలీస్ నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు తమ మండళ్లలో పోలీసు సిబ్బంది నంబర్లను రాసి పెట్టుకోవాలని సూచించారు.
Vinayaka Chavithi | మట్టి గణపతులను ప్రోత్సహించాలి
వీలైనంతవరకు మట్టి, తక్కువ ఎత్తుగల గణపతులను ప్రతిష్ఠించుకునేలా యువత ముందుకు రావాలని సీపీ సాయిచైతన్య కోరారు. గణేష్ భక్తులు, నిర్వాహకులు మద్యపానానికి దూరంగా ఉండాలని.. గణేష్ మండళ్ల వద్ద పేకాట ఆడవద్దన్నారు.