అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | గణేశ్ ఉత్సవాలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ సూచించారు. ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు డీజే నిర్వాహకులతో శనివారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గేటు వద్ద గల ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
మండపాల వద్ద కచ్చితంగా నిఘా ఏర్పాటు చేయాలని ఎస్సై సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఉండకూడదన్నారు. మద్యం సేవించి మండపాల వద్ద ఉండరాదని, డీజేలు, లౌడ్ స్పీకర్లతో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శోభాయాత్ర సమయంలో కచ్చితంగా విద్యుత్తు సరఫరాతో పాటు తగు సూచనలు సలహాలు కచ్చితంగా పాటించాలన్నారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆయా గ్రామాలకు చెందిన మండపాల నిర్వాహకులతో పాటు డీజే నిర్వాహకులు పాల్గొన్నారు.