అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : DCC Nizamabad | ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును పునరుద్ధరించాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలోని (Telangana) మెదక్, ఏపీలోని అనంతపూర్లో అప్పటి ప్రధాని మన్మోహన్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పర్యటించారన్నారు. ఆ సమయంలో వలసలు వెళ్లడంతో గ్రామాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఉండడాన్ని వారు గమనించారన్నారు.
అందులో భాగంగా పుట్టిందే మహాత్మా గాంధీ (Mahatma Gandhi) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని నగేష్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి కల్పిస్తూ వలసలను నివారించేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలియజేశారు. అలాంటి మహత్తరమైన పథకానికి ఉన్న పేరును నేటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తొలగించడం అవివేకమన్నారు.
DCC Nizamabad | 75 రోజుల భారం రాష్ట్రాలపైనే..
ఉపాధి పథకం వంద రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచుతున్నామని బీజేపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని కానీ వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం చేసిన 125 రోజుల పనిలో 75 రోజులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుందని నగేష్ రెడ్డి అన్నారు. మిగతా 50 రోజులు పని డబ్బుల భారాన్ని రాష్ట్రాలపై మోపిందన్నారు. మహాత్మా గాంధీ గారి పేరును తీసివేసి జీ ఆర్ జీ అని పేరు పెట్టి పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకొచ్చిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీలో పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. పూర్తిగా 125 రోజుల పనిదినాల భారాన్ని కేంద్రమే భరించాలని, తిరిగి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలనీ తీర్మానం చేయడం జరిగింది.
DCC Nizamabad | గ్రామాల్లో తీర్మానం చేయాలి..
నిజామాబాద్ జిల్లాలోని (Nizamabad District) ఆరు నియోజకవర్గాల్లో గల గ్రామాల్లో ఈనెల 20 నుంచి 30 తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు వివరించాలని తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. అదేవిధంగా 125 రోజుల పనిదినాన్ని మొత్తం కేంద్రమే భరించాలని ప్రతి గ్రామంలో సర్పంచులు తీర్మానం చేయాలని నగేష్ రెడ్డి (Nagesh Reddy) కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తప్పుడు మాటలతో అధికారంలోకి వచ్చిందని నరేంద్ర మోదీ (Narendra Modi) అధికారంలోకి రాకముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, వర్ని ఏఎంసీ ఛైర్మన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ బాబా, జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, నగర మైనారిటీ అధ్యక్షుడు ఎజాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా, మోపాల్ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, సర్పంచ్లు కిసాన్, నరేందర్ గౌడ్, గణేష్, జనార్దన్, అష్రఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు.