అక్షరటుడే, వెబ్డెస్క్: Gandhi Hospital | సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో 8 షేవింగ్ బ్లేడ్లను ముక్కలు చేసి మింగిన ఓ వ్యక్తికి, ఎలాంటి శస్త్రచికిత్స చేయకుండా అత్యంత సురక్షితంగా 16 పదునైన బ్లేడ్ ముక్కలను తొలగించారు.
వివరాలలోకి వెళితే.. మౌలాలీ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ ఖాజా(37), కుటుంబ కలహాలతో మనస్తాపానికి లోనై ఆగస్టు 16న 8 షేవింగ్ బ్లేడ్లను (Shaving Blades) రెండుగా విరగ్గొట్టి మొత్తం 16 ముక్కలుగా చేసి మింగేశాడు. కొన్ని గంటలకే తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఖాజా తన ప్రాణాలు పోతున్నాయంటూ విలపించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Gandhi Hospital | సర్జరీ అవసరం లేకుండా..
ప్రొఫెసర్ సునీల్ కుమార్ నేతృత్వంలోని జనరల్ మెడిసిన్ విభాగం వైద్య బృందం వెంటనే స్పందించి ఎక్స్‌రే, సీటీ స్కాన్(CT Scan) ద్వారా బ్లేడ్ ముక్కలు పొట్టలో ఉన్నట్లు నిర్ధారించారు. శస్త్రచికిత్స చేయకుండానే సమస్యను పరిష్కరించాలన్న ధృఢ సంకల్పంతో ఎండోస్కోపీ ద్వారా తొలగించే ఆలోచనను విరమించి, గాయాలు, రక్తస్రావం జరగకుండా ఉండేందుకు ‘ప్రోటాన్ పంప్’ థెరపీ (Proton Pump Therapy) అనే సరికొత్త వైద్య పద్ధతిని ఎన్నుకున్నారు. వైద్యులు ఖాజాకు ఆహారం, నీరు నిలిపివేసి, ఐవీ ద్రవాలు శరీరంలోకి పంపారు. దాంతో బ్లేడ్ ముక్కలు (Blade Pieces) నెమ్మదిగా పేగులలో కదిలి మల విసర్జన ద్వారా బయటకు వచ్చేలా చేశారు. మూడు రోజులపాటు సాగిన ఈ సాహసోపేత చికిత్స అనంతరం అన్ని బ్లేడ్ ముక్కలు పూర్తిగా బయటపడ్డాయి.
మరోసారి ఎక్స్‌రే ద్వారా పొట్టలో ఏ ముక్కలూ లేవని నిర్ధారించాకే ఖాజాని డిశ్చార్జ్ ఇచ్చారు. ఆసుపత్రి అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, ఈ కేసును నిన్న మీడియాకు వివరించారు. ఖాజా ఆగస్టు 21న పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఈ అత్యంత క్లిష్ట పరిస్థితిని సర్జరీ లేకుండా సురక్షితంగా పరిష్కరించిన గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital) వైద్య బృందాన్ని, పలువురు ప్రముఖులు, వైద్యులు అభినందిస్తున్నారు. ఈ ఘటన మరోసారి గాంధీ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యాన్ని, అత్యాధునిక చికిత్సా విధానాల వినియోగ సామర్థ్యాన్ని నిరూపించింది.