అక్షరటుడే, వెబ్‌డెస్క్: Urea Problems | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు శనివారం హైదరాబాద్‌లో యూరియా కొరతపై ఆందోళనలు చేపట్టారు. గన్‌పార్కు వద్ద, వ్యవసాయ శాఖ కమిషనరేట్ (Agriculture Commissionerate) ఎదుట, సచివాలయం వద్ద నిరసనలు తెలిపారు.
ఉదయం అసెంబ్లీ ప్రారంభానికి ముందు గులాబీ ఎమ్మెల్యేలు తొలుత గన్‌పార్కు అమరుస్థూపం వద్ద నిరసనలు కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి బొప్పా మోరియా.. కావాలయ్యా యూరియా అని నినాదాలు చేశారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు సంతాపం తెలిపిన అనంతరం సభ ఆదివారానికి వాయిదా పడింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA) అసెంబ్లీ నుంచి నేరుగా వ్యవసాయ శాఖ కమిషనరేట్ వద్దకు తరలివెళ్లి ఆందోళన చేపట్టారు.
Urea Problems | కమిషనరేట్ ఎదుట ధర్నా
రాష్ట్రంలో యూరియా కొరత (Urea Shortage) తీర్చాలంటూ అసెంబ్లీ నుంచి ర్యాలీగా వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కమిషనరేట్ ఎదుట భైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ దోషం – రైతన్నకు మోసం, సీఎం డౌన్‌డౌన్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
హరీశ్‌రావు(Harish Rao)తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు లోపలికి వెళ్లి కమిషనర్‌ను కలిశారు. యూరియా కొరత తీర్చాలని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మేం రాజకీయాలు చేయడం లేదు.. రైతుల తరపున మాట్లాడుతున్నామని బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. దాదాపు అరగంటకు పైగా ఆందోళన నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఆయా పోలీసు స్టేషన్లకు వారిని తరలించారు.
Urea Problems | సచివాలయం ఎదుట ఆందోళన
పోలీసుల నుంచి తప్పించుకున్న కొందరు ఎమ్మెల్యేలు, పోలీసుస్టేషన్ల నుంచి విడుదలైన ఎమ్మెల్యేలు కలిసి సచివాలయం వద్దకు చేరుకున్నారు. హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి సహా కొందరు పోలీసుల నుంచి తప్పించుకుని రోడ్లపై పరుగెత్తుతూ సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాయయం గేటు ఎదుట భైఠాయించారు.
యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ (Congress Party) అంటూ నినాదాలు చేశారు. పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది ఈ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా” అంటూ నినదించారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని మరోసారి అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.