అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs NZ | న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గత రాత్రి జరిగిన టీ20లో భారత ఘోర పరాజయం చవి చూసింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాకు విశాఖపట్నం (Visakhapatnam)లో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది.
విధ్వంసకర బ్యాటింగ్, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఏకపక్షంగా గెలుస్తూ వచ్చిన భారత్‌కు నాలుగో టీ20లో కివీస్ కళ్లెం వేసింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా (Team India) అన్ని విభాగాల్లోనూ తడబడి 50 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.4 ఓవర్లలో కేవలం 165 పరుగులకే ఆలౌటైంది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడం టీమిండియాకి మైనస్‌గా మారింది.
IND vs NZ | తేడా కొట్టింది..
అభిషేక్ శర్మ (Abisekh Sharma) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఈ కష్ట సమయంలో శివమ్ దూబే (Shivam Dube) ఒంటరి పోరాటం చేశాడు. 23 బంతుల్లో ఏడు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 65 పరుగులు చేసి ఆశలు రగిలించినా ఫలితం లేకుండా పోయింది. రింకూ సింగ్ 39 పరుగులతో కొంత మద్దతిచ్చినా, మిగతా బ్యాటర్లు నిలకడ చూపలేకపోయారు. న్యూజిలాండ్ (New Zealand) బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లతో కీలకంగా రాణించగా, జాకోబ్ డఫీ, ఇష్ సోధి రెండేసి వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించగా, డెవాన్ కాన్వే చురుకైన ఇన్నింగ్స్‌తో పునాది వేశాడు.
చివరలో డారిల్ మిచెల్(18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.దాంతో స్కోరు 200 పరుగులు దాటింది. భారత బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) రెండేసి వికెట్లు తీసినా, కీలక దశల్లో పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం చర్చనీయాంశంగా మారింది. గాయంతో ఇషాన్ కిషన్ దూరం కావడంతో అదనపు బ్యాటర్‌ను తీసుకోకుండా, అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించడం వ్యూహాత్మక నిర్ణయంగా భావించబడుతోంది. ఎక్స్ట్రా బ్యాటర్ లేకుండా బ్యాటింగ్ లైనప్ ఎలా స్పందిస్తుందో పరీక్షించాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయోగం ఈ మ్యాచ్‌లో మాత్రం ఫలించలేదు.ఈ ఓటమితో ఐదు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-3తో నిలిచింది. ఇప్పటికే సిరీస్ భారత్ ఖాతాలో ఉన్నప్పటికీ, ఈ పరాజయం చివరి మ్యాచ్‌కు ఉత్కంఠను పెంచింది. సిరీస్ చివరి టీ20 శనివారం తిరువనంతపురంలో జరగనుండగా, అక్కడ భారత్ తిరిగి గెలుపు బాట పట్టాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.