అక్షరటుడే, వెబ్డెస్క్: Gadgets : తల్లి కావడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. తన ప్రాణం కంటే ఎక్కువగా బిడ్డను చూసుకునే ప్రతి తల్లి, పసిపాపలకు ఎలాంటి చిన్న కష్టం రాకూడదని తపిస్తుంది. పిల్లలు కింద పడకూడదని, వారికి దెబ్బలు తగలకూడదని మార్కెట్లో దొరికే రకరకాల గ్యాడ్జెట్లను వాడుతుంటారు. అయితే, అతి జాగ్రత్తతో మనం వాడే కొన్ని వస్తువులు పిల్లల సహజ ఎదుగుదలకు ఆటంకంగా మారుతాయని మీకు తెలుసా? పిల్లల భవిష్యత్తు కోసం దూరం పెట్టాల్సిన కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Gadgets : మోకాలి రక్షణ కవచాలు (Knee Caps):
సాధారణంగా ఐదు నెలల వయసు నుంచి పిల్లలు పాకడం మొదలుపెడతారు. నేలపై పాకేటప్పుడు మోకాళ్లు గీసుకుపోతాయని చాలామంది తల్లులు ‘నీ క్యాప్స్’ వేస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల పిల్లలు నేలపై పట్టు కోల్పోయి జారిపడే అవకాశం ఉంది. నిజానికి, మోకాళ్లపై పాకడం వల్ల అక్కడి ఎముకలు దృఢంగా మారి, నడవడానికి సిద్ధమవుతాయి. ఈ సహజ ప్రక్రియను నీ క్యాప్స్ అడ్డుకుంటాయి.
Gadgets : బేబీ హెల్మెట్లు (Baby Helmets):
పిల్లలు అడుగులు వేసేటప్పుడు కింద పడటం చాలా సహజం. తలకు దెబ్బ తగులుతుందనే భయంతో కొందరు హెల్మెట్లు పెడుతుంటారు. దీనివల్ల పడినా దెబ్బ తగలదు కానీ, పిల్లల్లో ‘బ్యాలెన్సింగ్’ నైపుణ్యం పెరగదు. పడినప్పుడు కలిగే చిన్నపాటి నొప్పి వల్లే శిశువు మెదడు అప్రమత్తమై, మళ్ళీ పడకుండా ఎలా నడవాలో నేర్చుకుంటుంది. హెల్మెట్ల వల్ల పిల్లలు ఆ గొప్ప నైపుణ్యాన్ని కోల్పోతారు.
వాకర్లు (Walkers):
బిడ్డ త్వరగా నడవాలని చాలామంది వాకర్లను కొంటుంటారు. అయితే, ఆధునిక వాకర్లు పిల్లల నడక సామర్థ్యాన్ని పెంచడానికి బదులు దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాకర్లలో పిల్లలు కేవలం కాళ్లను నెట్టడం మాత్రమే నేర్చుకుంటారు కానీ, సొంతంగా బ్యాలెన్స్ చేయడం నేర్చుకోలేరు. తప్పనిసరి అనుకుంటే, పాతకాలపు ‘మూడు చక్రాల తోపుడు బండి’ (Pushers) లాంటివి వాడటం ఉత్తమం.