HomeUncategorizedG7 Summit | ఇజ్రాయెల్​కు మద్దతు ప్రకటించిన జీ7 దేశాలు

G7 Summit | ఇజ్రాయెల్​కు మద్దతు ప్రకటించిన జీ7 దేశాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: G7 Summit | ఇరాన్​–ఇజ్రాయెల్(Iran–Israel)​ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియలో యుద్ధమేఘాలు అలుముకున్న విషయం తెలిసిందే. ఇరాన్​లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్​ రైజింగ్​ లయన్(Operation Rising Lion)​ పేరిట మొదట ఇజ్రాయెల్​ దాడులకు పాల్పడింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్​ ట్రూ ప్రామిస్​–3 పేరిట టెల్​అవీవ్​పై విరుచుకుపడింది. దీంతో రెండు దేశాల మధ్య దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జీ7 దేశాలు ఇజ్రాయెల్​కు మద్దతు తెలిపాయి.

ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉండి.. ఆర్థిక వ్యవస్థను శాసించే స్థితిలో ఉన్న ఏడు దేశాలు కూటమిగా ఏర్పడ్డాయి. దీనిని జీ–7 కూటమి అంటారు. ఇందులో అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్​, జర్మనీ, ఇటలీ, జపాన్​ దేశాలు ఉన్నాయి. 1975లో ఈ కూటమి ఏర్పడింది. ప్రస్తుతం కెనడాలో జీ7 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు కెనడా ప్రధాని మార్క్​ కార్నే(Canadian PM Mark Carney) భారత ప్రధాని మోదీని(PM Modi) ఆహ్వానించారు. దీంతో మోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే సమావేశంలో భాగంగా ఇరాన్​– ఇజ్రాయెల్​ ఉద్రిక్తతలపై ప్రతినిధులు చర్చించారు.

G7 Summit | ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉంది

ఇరాన్​ అణుశక్తి దేశంగా మారితే తమకు ముప్పు పొంచి ఉందని టెల్​అవీవ్(Tel Aviv)​ ఆపరేషన్​ రైజింగ్​ లయన్​ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై జీ 7 దేశాలు స్పందిస్తూ ఇజ్రాయెల్​కు ఆత్మరక్షణ హక్కు ఉందని ప్రకటించారు.

ఇజ్రాయెల్‌కు కూటమి దేశాలు మద్దతు ప్రకటించాయి. అంతేగాకుండా దాడులను విరమించుకోవాలని ఇరాన్​కు సూచించాయి. ఇరాన్‌ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రాంతీయ అస్థిరత, ఉగ్రవాదానికి ఇరాన్‌ కారణమని ఆయా దేశాలు అభిప్రాయపడ్డాయి. యుద్ధ ప్రభావం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై పడుతుందని, అప్రమత్తంగా ఉండాలని జీ7 దేశాలు సూచించాయి.

G7 Summit | ఇరాన్​ గెలవదు

ప్రాంతీయ సుస్థిరత కోసం రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని జీ7 దేశాలు సూచించాయి. సదస్సులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్(US President Donald Trump)​ మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో ఇరాన్‌ గెలవదని చెప్పారు. ఆలస్యం కాకముందే ఇరాన్‌ సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభిస్తే మేలని సూచించారు. అమెరికా సంస్థలపై దాడిచేస్తే కనీవినీ ఎరుగని రీతిలో ప్రతిదాడులు చేస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు. కాగా.. ఇజ్రాయెల్​లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్​ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్​–ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు తన కెనడా(Canada) పర్యటనను మధ్యలోనే ముగించుకొని తిరుగు పయనం అయ్యారు. జీ7 సదస్సు నుంచి ఆయన అమెరికా బయలుదేరారు.