అక్షరటుడే, వెబ్డెస్క్ : G RAM G Bill | ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్లుకు లోక్సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. పార్లమెంట్లో (Parliament) తీవ్ర గందరగోళం మధ్య గురువారం ఈ బిల్లును స్పీకర్ ఆమోదించారు.
దేశంలో రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. దాని స్థానంలో VB–G RAM G బిల్లును తీసుకొచ్చింది. కొత్త బిల్లు చట్ట రూపం దాలిస్తే ఉపాధి హామీ పనిదినాలు 100 నుంచి 125 రోజులు పెరగనున్నాయి. అయితే ఈ పథకం పేరు మార్పుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గాంధీజీ పేరును తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
G RAM G Bill | గందరగోళం మధ్యే..
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ బిల్లును లోక్సభలో ప్రవేశ పెట్టారు. దీనిపై ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. బిల్లు ప్రతులను చింపి గాలిలోకి విసిరేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. గందరగోళం మధ్యే స్పీకర్ బిల్లును ఆమోదించారు. మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఈ చట్టం ఉపాధిని నిర్ధారిస్తుందన్నారు. గ్రామాలను పేదరికం రహితంగా మారుస్తుందని, వాటి వృద్ధి ప్రయాణానికి ఇంధనంగా ఉంటుందని పేర్కొన్నారు.
G RAM G Bill | విపక్షాల ఆందోళన
MGNREGA రద్దు, పేరు మార్చడంపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తీవ్ర దాడి చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Congress MP Mahua Moitra) ప్రభుత్వం గాంధీ వారసత్వాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. చట్టం నుంచి జాతిపిత పేరును తొలగించడం అతిపెద్ద నేరం అని కాంగ్రెస్ ఎంపీ జై ప్రకాష్ అన్నారు. ప్రతిపాదిత చట్టం రాష్ట్రాలకు కొత్త ఆర్థిక బాధ్యతలను సృష్టిస్తుందన్నారు.