అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagadish Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) సోమవారం స్పందించారు.
రియల్ ఎస్టేట్ దందా కోసమే రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. సీఎం, ఆయన బంధువులు కొనుగోలు చేసిన వేల ఎకరాల భూముల ధరలు పెంచుకోవడానికి తప్ప దీంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ ఏమిటో తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన పదవి ఎప్పుడు పోతుందో తెలియదని, ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారంటూ వ్యాఖ్యానించారు. లేని ఫ్యూచర్ సిటీ (Future City) నుంచి ఇంకా కట్టని అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే, రైల్వే లైన్ నిర్మిస్తారంటా అని ఆయన అన్నారు. హైదరాబాద్, అమరావతికి రేవంత్‌రెడ్డి, చంద్రబాబు (Chandrababu) తిరుగుతారేమోనని ఎద్దేవా చేశారు.
Jagadish Reddy | మంత్రుల తీరుపై విమర్శలు
ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడితే, మంత్రులు, ఎమ్మెల్యేలు మరో మాట మాట్లాడుతున్నారని జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మైక్ ముందు ట్రిపుల్ ఆర్ రోడ్డు వెంటనే పూర్తి చేస్తామని అంటారని, అదే బాధితులు వెళ్లి అడిగితే ఇప్పట్లో అవ్వదు వెళ్లిపొండి అని చెబుతారన్నారు. తనకు తెలియకుండా లిక్కర్ రేట్లు పెంచారని ఎక్సైజ్ మంత్రి అంటారని విమర్శించారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన నియోజకవర్గంలో వరదలు వచ్చాయని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారన్నారు. అసలు ఈ ప్రభుత్వంలో ఏం నడుస్తుంది అని ఆయన ప్రశ్నించారు.
Jagadish Reddy | ఎల్‌అండ్‌టీపై సీఎం ఒత్తిడి
రేవంత్ రెడ్డి పథకం ప్రకారం ఎల్అండ్టీ సంస్థపై ఒత్తిడి తెచ్చి వాళ్లను వెళ్లగొట్టారని మాజీ మంత్రి ఆరోపించారు. ఇందులో సీఎం రూ.వెయ్యి కోట్ల లాభం పొందారన్నారు. అలాగే మెట్రోకు ఉన్న రూ.35 వేల కోట్ల విలువ గల 300 ఎకరాల ఆస్తులను అదానీ, మేఘా కృష్ణారెడ్డిలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. పెరుగుతున్న జనాభాకు సరిపోయే పద్ధతుల్లో మెట్రోను మూడు ఫేజ్‌ల్లో విస్తరించాలని కేసీఆర్ ఆనాడు చెప్పారని గుర్తు చేశారు.