అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ వేడుకల (Bathukamma celebrations)కు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో ఇటీవల వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు.
రాష్ట్రంలో ఆడపడుచులకు హరీశ్‌రావు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయడానికి పంచాయతీల్లో నిధులు (Funds) లేవని విమర్శించారు. గ్రామాల్లో కనీసం వీధిదీపాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు.
కేసీఆర్ (KCR) హయాంలో బతుకమ్మ పండుగ కోసం అనేక ఏర్పాట్లు చేసేవారమన్నారు. బతుకమ్మలు తీసుకు వెళ్లే మార్గాల్లో రోడ్లకు మరమ్మతులు, వీధిదీపాలు ఏర్పాటు చేయడంతో పాటు బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.
Harish Rao | ఎన్నికలు పెట్టే ధైర్యం లేదు
రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పాలనలో గ్రామాల్లో ఒక్క రూపాయి లేదని హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు అప్పులపాలు అయ్యారన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు లేరన్నారు. స్థానిక ఎన్నికలు (Local Body Elections) పెట్టే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేదని విమర్శించారు. పండుగ పూట వీధిదీపాలు ఏర్పాటు చేసే దిక్కు లేకుండా పోయిందన్నారు. గ్రామాల్లో చెత్త ఎత్తే ట్రాక్టర్లలో డిజీల్ పోయడానికి కూడా పైసలు లేవన్నారు. పండుగ ఏర్పాట్ల కోసమైనా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌పాలనలో గ్రామాలు మురికి కూపాలుగా మారాయన్నారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు నిధులు ఇస్తున్న రేవంత్‌రెడ్డి పల్లెలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Harish Rao | కండువాలు ఎందుకు కప్పావు
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి బరితెగించి మాట్లాడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. కండువా కప్పితే పార్టీ మారినట్టు కాదని సీఎం అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు కండువా ఎందుకు కప్పారని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం పార్టీ మారాము అని ఒకవైపు ఫిరాయించిన ఎమ్మెల్యేలు చెబుతున్నా.. సీఎం ఇంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ (PCC Chief Mahesh Goud) చెప్పారన్నారు. గాంధీభవన్ జరిగిన సమావేశానికి సదరు ఎమ్మెల్యేలు హాజరయ్యారని హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎల్పీ మీటింగ్‌కు సైతం హాజరయ్యరని గుర్తు చేశారు. అయినా కానీ కండువా కప్పితే పార్టీ మారినట్లు కాదని రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.