అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Union Cabinet | కేంద్ర కేబినెట్ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో నాలుగు సెమీ కండక్టర్ ప్లాంట్ల (Semi Conductor Plants) ఏర్పాటుకు రూ.4,594 కోట్లు మంజూరు చేసింది. ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే బీహార్ రాజధాని పాట్నలో మెట్రో (Patna Metro) విస్తరణకు సైతం నిధులు మంజూరు చేసింది.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) ఈ ఏడాది చివరలో జరగనున్నాయి. ప్రస్తుతం జేడీయూ, బీజేపీ కలిసి అధికారంలో ఉన్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ భావిస్తోంది. ఈ క్రమంలో 2025 బడ్జెట్లో సైతం బీహార్‌కు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. తాజాగా లక్నోలో మెట్రో ఫేస్ 1బీ కోసం రూ.5,801 కోట్లు మంజూరు చేయడానికి యూనియన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లోని టాటో –2 హైడ్రాలిక్ ప్రాజెక్ట్ (Hydralic Project) కోసం రూ.8,146 కోట్లు మంజూరు చేసింది.
Union Cabinet | హైదరాబాద్ ఆశలపై నీళ్లు
హైదరాబాద్ (Hyderabad) నగరంలో మెట్రో రెండో దశకు నిధులు మంజూరు చేయకుండా కేంద్రం మరోసారి మొండిచేయి చూపింది. నగరంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మెట్రో రెండో దశ పనులు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) యోచిస్తున్నారు. ఈ మేరకు ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయాలని పలుమార్లు కోరారు. అయితే తాజాగా బీహార్‌కు నిధులు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ గురించి పట్టించుకోలేదు. బీహార్‌లో ఎన్నికలు ఉండటంతోనే నిధులు మంజూరు చేశారనే విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. నగరంలో రద్దీ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మెట్రో రెండో దశ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్య కొంత మేర తగ్గనుంది. అయితే దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం (State Govt) నిధులు విడుదల చేసినా.. కేంద్రం నుంచి సహకారం లభించడం లేదు. లక్నో మెట్రోకు నిధులు, ఏపీలో సెమీ కండక్టర్ ప్లాంట్ మంజూరు చేసిన కేంద్ర కేబినెట్ తెలంగాణ డిమాండ్‌పై పట్టించుకోకపోవడం గమనార్హం.
