అక్షరటుడే, వెబ్డెస్క్ : Kabaddi Association | తెలంగాణ కబడ్డీ అసోసియేషన్(Kabaddi Association )లో నిధుల గోల్‌మాల్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
రూ.కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని అసోసియేషన్ మాజీ సంయుక్త కార్యదర్శి, జాతీయ కబడ్డీ ప్లేయర్ తోట సురేశ్ (Thota Suresh) సంచలన ఆరోపణలు చేశారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్‌యాదవ్, కోశాధికారి కేబీ శ్రీరాములు నిధులను సొంతానికి వినియోగించుకున్నారని ఆయన అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు కూడా నమోదైంది.
సురేశ్ 2020 నుంచి 2024 వరకు అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా పని చేశాడు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా కబడ్డీ అసోసియేషన్లో జరుగుతున్న అవినీతిని ఆయన బయట పెట్టాడు. జిల్లాస్థాయి కబడ్డీ పోటీల (District Level Kabaddi Tourny) కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను జగదీశ్వర్‌యాదవ్, శ్రీరాములు దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. ఇలా రూ.60 లక్షలు సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Kabaddi Association | జాతీయ టోర్నీ నిధులు సొంతానికి..
సూర్యాపేట(Suryapeta)లో 2021లో జరిగిన జాతీయ జూనియర్ కబడ్డీ టోర్నీ (National Junior Kabbadi Tourny)కి కేటాయించిన రూ.1.20 కోట్లలో.. రూ.50 లక్షలు వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నట్లు ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ (PKL) కోసం ఒక సంస్థ ఇచ్చిన రూ.20 లక్షల నిధులను సైతం జగదీశ్వర్‌యాదవ్, శ్రీరాములు వాడుకున్నట్లు ఫిర్యాదులో తెలిపారు. సంఘంలో అక్రమాలపై ప్రశ్నించినందుకు తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేగాకుండా తనను మహబూబాబాద్ జిల్లా అసోసియేషన్ నుంచి తొలిగించారన్నారు. అసోసియేషన్లో అక్రమాలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని సురేశ్ కోరారు.