అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు ఆదివారం (ఆగస్టు 24) రాత్రి ముఖ్యమంత్రిని కలిశారు.
సినిమా కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.
సినీ కార్మికులను, నిర్మాతలను ప్రభుత్వం కాపాడుకుంటుందని, నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి సమగ్రమైన విధానం తీసుకొస్తే బాగుంటుందని అన్నారు.
సినిమా పరిశ్రమలో సుహృద్భావ పని వాతావరణం ఉండాలని, సినిమా పరిశ్రమ (Tollywood film industry) కు నియంత్రణ అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. సమస్యలపై సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడతానని చెప్పారు.
సినిమా పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి స్కిల్స్ పెంచుకునేలా చర్యలు ఉండాలని, పరిశ్రమలో వివిధ అంశాల్లో స్కిల్స్ పెంచుకోవడానికి ఒక కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పారు.
ఆయా విభాగాల్లో స్కిల్స్ పెంచుకోవడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills University) లో సినిమా పరిశ్రమ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు.
తెలంగాణలో ఒక ముఖ్యమైన పరిశ్రమగా తెలుగు సినిమా (Telugu film) రంగం అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించానని ముఖ్యమంత్రి చెప్పారు.
సినిమా పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల విషయంలో సంస్కరణలు అవసరమని చెప్పారు. పరిశ్రమకు ఏం కావాలో ఒక నియమావళి నిర్దేశించుకుంటే మంచిదన్నారు.
సినీ పరిశ్రమ విషయంలో నిష్పాక్షికంగా ఉంటానని, పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని, అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందేనని స్పష్టం సీఎం చేశారు.
హైదరాబాద్లో అంతర్జాతీయ సినిమాల (international films) చిత్రీకరణ కూడా జరుగుతోందని సీఎం (Chief Minister Revanth Reddy) పేర్కొన్నారు.
తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే ధ్యేయమని స్పష్టంగా చెప్పారు.
ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిలిమ్ డెవల్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు…
నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డివివి దానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము…
దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.