అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cricketers | క్యాన్సర్ మహమ్మారి ఎంత మంది ప్రాణాలు బలిగొంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ ప్రాణాంతక వ్యాధి క్రీడా రంగానికి చెందిన లెజండరీ క్రికెటర్లను సైతం వదలకుండా ఇబ్బంది పెట్టింది. కానీ కొంతమంది దీన్ని జయించి తిరిగి మైదానాల్లోకి అడుగుపెట్టారు. రీసెంట్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (Michael clarke) తన స్కిన్ క్యాన్సర్ గురించి తెలియజేస్తూ, ఆరోసారి స్కిన్ సర్జరీ చేయించుకున్నట్టు స్పష్టం చేశాడు. క్లార్క్ వ్యాఖ్యలతో ఈ వ్యాధిపై అవగాహన మళ్లీ చర్చకు వచ్చింది. అయితే క్రీడా రంగంలో ఇప్పటి వరకు ఎంత మంది క్యాన్సర్ బారిన పడ్డారనేది చూస్తే..
1. మైఖేల్ క్లార్క్ : 2006లో తొలిసారిగా స్కిన్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించబడ్డాయి. 2019లో ఆయన నుదురుపై మూడు నాన్-మెలనోమా కణాలను తొలగించేందుకు శస్త్రచికిత్స చేశారు. అనారోగ్య సమస్యల మధ్యే తన కెరీర్ కొనసాగించిన క్లార్క్, 2015లో ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించిన ఘనత కూడా సాధించారు.
2. యువరాజ్ సింగ్ : 2011 వరల్డ్ కప్ సమయంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా అద్భుతంగా ఆడిన యువరాజ్ (Yuvraj Singh), ఆ టోర్నమెంట్‌లో 15 వికెట్లు తీయడంతో పాటు 362 పరుగులు చేశారు. తర్వాత ఊపిరితిత్తుల్లో కణితి (ట్యూమర్) ఉన్నట్లు తేలింది. అమెరికాలో చికిత్స అనంతరం 2012లో జాతీయ జట్టులోకి తిరిగి వచ్చారు.
3. రిచీ బెనౌడ్ : ఆస్ట్రేలియా (Australia) దిగ్గజ కెప్టెన్, ప్రసిద్ధ వ్యాఖ్యాత. చివరి రోజుల్లో స్కిన్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. నుదురు, తలపై క్యాన్సర్ ఉండగా, 2015లో ఆయన మరణించారు.
4. జియోఫ్రే బాయ్‌కాట్ : 2003లో గొంతు క్యాన్సర్ బారిన పడ్డారు. 35 సెషన్ల రేడియోథెరపీ అనంతరం కోలుకొని కామెంట్రీకి (Commentry) తిరిగి వచ్చారు.
5. ఆండీ ఫ్లవర్ : ఇంగ్లాండ్ మాజీ కోచ్ ఆండీకి 2010లో కుడి చెంపపై స్కిన్ క్యాన్సర్ వచ్చింది. శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా కోలుకుని, ఆపై ప్రజలకు క్యాన్సర్ అవగాహన కల్పించడంలో భాగస్వామిగా మారారు.
6. గ్రేమ్ పొలాక్ : దక్షిణాఫ్రికా (South Africa) దిగ్గజ క్రికెటర్. 2013లో పెద్ద పేగు క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. కోలుకున్నప్పటికీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
7. మార్టిన్ క్రో : న్యూజిలాండ్ (New Zealand) తరఫున గొప్ప బ్యాట్స్‌మెన్. 2012లో లింఫోమా క్యాన్సర్ సోకింది. ఇది రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసే క్యాన్సర్. 2016లో, 53 ఏళ్ల వయసులో మరణించారు.
8. సామ్ బిల్లింగ్స్ : ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్. 2022లో ఛాతీపై మెలనోమా స్కిన్ క్యాన్సర్ రావడంతో రెండు సర్జరీలు చేయించుకున్నారు. ఆయన కూడా స్కిన్ క్యాన్సర్ పై అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా ఈ క్రికెటర్లు Cricketers చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం. వ్యాధి ఎంత తీవ్రమైనా, పోరాట పటిమ ఉంటే దాన్ని జయించొచ్చని నిరూపించారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు, సమయానికి పరీక్షలు, నివారణ చర్యలు తీసుకోవడం అవసరం.