అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Chandrababu | ఇండియాలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (Andhra Pradesh CM Chandrababu) అగ్రస్థానంలో నిలిచారు. 30 మంది ముఖ్యమంత్రుల్లో రూ.931 కోట్ల సంపదతో బాబు ముందు వరుసలో ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో చంద్రబాబు ఆస్తులపై చర్చ జరుగుతోంది. వారసత్వంగా వచ్చిన సంపద కాకుండా ఆయన స్వతహాగా ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మూడు దశాబ్దాల క్రితం చంద్రబాబు స్థాపించిన పాల వ్యాపారం (milk business) అనతి కాలంలోనే అద్భుత సంపదను సృష్టించింది.
CM Chandrababu | రూ.7 వేలతో ప్రారంభం..
చంద్రబాబుకు దూరదృష్టి ఎక్కువ అని అందరూ చెబుతారు. అందుకే ఆయన రాజకీయాలతో పాటు వ్యాపారంలోనూ విజయం సాధించారని పేర్కొంటారు. మన దేశంలో ఆర్థిక సంస్కరణల కింద పాడి పరిశ్రమలో ప్రైవేట్ పెట్టుబడులు (private investment) అనుమతిస్తున్న సమయంలోనే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 1992లో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌ను (Heritage Foods Limited) స్థాపించారు. కేవలం రూ.7 వేల చెల్లింపు మూలధనంతో ప్రారంభమైన ఈ కంపెనీ 1994లో ఐపీవోకు రాగా, 54 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది.
ఐపీఓతో రూ.6.5 కోట్లు సేకరించింది. దీంతో కంపెనీకి ఎదురే లేకుండా పోయింది. మూడు దశాబ్దాల్లో హెరిటేజ్ 17 రాష్ట్రాలకు విస్తరించింది. దాదాపు 3 లక్షల మంది పాడి రైతులతో భాగస్వామ్యంతో పాన్-ఇండియా బ్రాండ్‌గా ఎదిగింది. కంపెనీ టర్నోవర్ అనేక మైలురాళ్లు దాటింది. బాబు కుటుంబానికి 41.3 శాతం వాటా ఉన్న ఈ కంపెనీ2000 సంవత్సరా నాటికి రూ.100 కోట్ల వార్షిక టర్నోవర్ నుంచి 2025 నాటికి రూ.4,000 కోట్లకు ఎదిగింది. 1995లో రూ.25 కోట్లుగా ఉన్న హెరిటేజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2024 మధ్యలో రూ.6,755 కోట్లకు చేరుకుంది.
CM Chandrababu | రాజకీయాల్లో ఒడిదొడుకులున్నా..
చంద్రబాబు రాజకీయ ప్రస్థానం (Chandrababu political career) అనేక ఒడిదుడుకులతో సాగింది. నాలుగుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. 2004, 2009 ఎన్నికలతో పాటు రాష్ట్ర విభజన జరిగిన తరవాత 2019 ఎన్నికల్లో బాబు పార్టీ టీడీపీ ఓటమి మూటగట్టుకుంది. ఈ క్రమంలో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఓర్చుకున్న చంద్రబాబు 2024లో తిరిగి అధికారంలోకి వచ్చారు. అదే సమయంలో తన రాజకీయ ప్రభావం సంస్థపై పడకుండా చూసుకున్నారు.
CM Chandrababu | భార్య, కోడలి మార్గదర్శనంలో..
1994లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో హెరిటేజ్ బాధ్యతలను భార్య భువనేశ్వరికి (Nara Bhuvaneshwari) అప్పగించారు. ఆమె ఆధ్వర్యంలో కంపెనీ అనేక రాష్ట్రాలకు విస్తరించింది. రాష్ట్ర రాయితీలు లేదా ప్రాధాన్యత ఒప్పందాలు లేకుండా వృద్ధితో పాటు రైతు-కేంద్రీకృత కార్యకలాపాలకు ఖ్యాతిని కొనసాగిస్తోంది. దీని నికర విలువ 1994లో రూ.9.99 కోట్లుగా ఉండగా, 2025లో రూ.972 కోట్లకు పెరిగింది, ఇది ఒక రాజకీయ నాయకుడి ప్రకటించిన సంపద పారదర్శకంగా, బహిరంగంగా జాబితా చేయబడిన సంస్థతో ముడిపడి ఉందనడానికి అరుదైన ఉదాహరణగా నిలిచింది.