అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Zoho | వికసిత్ భారత్‌లో భాగంగా స్వదేశీకి పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం (central government) ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ అధికారిక మెయిల్స్ అన్నీ స్వదేశీ సంస్థ అయిన జోహో (Zoho) ద్వారానే జరపాలని నిర్ణయించింది.
ఈ విషయాన్ని జోహో సహా వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వెల్లడించారు. కోడ్స్, డేటా సెంటర్లు, భద్రతా పద్ధతుల బహుళ ఆడిట్లతో కూడిన కఠినమైన పరిశీలన ప్రక్రియ తర్వాత నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (National Informatics Center) ఈమెయిల్ వ్యవస్థను శక్తివంతం చేయడానికి ఆమోదం పొందిందని శ్రీధర్ వెంబు సోమవారం తెలిపారు. 20 భద్రతా ఆడిట్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం తమ జోహో మెయిల్ సేవల్ని అంగీకరించిందని జోహో కార్పొరేషన్ కంపెనీ (Zoho Corporation Company) సహ-స్థాపకుడు శ్రీధర్ వెంబు వెల్లడించారు.
Zoho | జోహో ద్వారానే మెయిల్స్..
భారతదేశంలో ఇప్పటి వరకూ అధికార, అనధికార ఈ మెయిల్ సేవలన్నీ దాదాపు జీమెయిల్ ద్వారానే జరిగేవి. అయితే, స్వదేశీ సంస్థ జోహో రాకతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పటికే వాట్సప్ స్థానానికి స్వదేశీ సంస్థ అరట్టై ఎసరు పెడుతుండగా, ఇప్పుడు జీమెయిల్ స్థానాన్ని జోహో మెయిల్ ఆక్రమించనుంది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సంస్థలకు దన్నుగా నిలుస్తోంది.
అందులో భాగంగానే ఇక నుంచి అన్ని అధికారిక మెయిల్స్‌ను జోహో ద్వారానే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. తాను జోహోకు మారినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ఇటీవల ప్రకటించారు. తనకు పంపే మెయిల్స్ అన్ని ఇక నుంచి జోహో మెయిల్ ఐడీకి (Zoho mail ID) పంపాలని కోరారు. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) నిర్వహించిన అన్ని ఆడిట్లలో తమ జోహో మెయిల్ సేవలు విజయం సాధించాయని, ఇది చాలా సంతోషకరమైన విషయమని శ్రీధర్ ప్రకటించారు.
Zoho | జోహోకు టెండర్
దాదాపు 33 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు (government employees) నమోదు చేసుకున్న నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈమెయిల్ సొల్యూషన్ నుంచి సురక్షితమైన క్లౌడ్ సేవలకు వలస కోసం 2023లో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీ) టెండర్లు ఆహ్వానించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మీటీ) జారీ చేసిన టెండర్లో జోహో మెయిల్ విజేతగా నిలిచిందని శ్రీధర్ వెల్లడించారు. దీని వెనుక 15 నుంచి 20 వరకు భద్రతా ఆడిట్లు జరిగాయన్నారు. ఈ ఎంపిక ఆషామాషీగా జరుగలేదని, ‘మా కోడ్, డేటా సెంటర్లు, భద్రతా పద్ధతులు అన్నీ పరిశీలించేందుకు విస్తృత ఆడిట్లు జరిగాయని చెప్పారు.
ఎన్ఐసీ టీమ్ అన్ని భద్రతా పరీక్షలు నిర్వహించాకే తమ సంస్థని ఎంపిక చేసిందన్నారు. జోహో ఎంపిక అనేది అకస్మాత్తుగా లేదా రాజకీయంగా నడిచే చర్య అనే ఆరోపణలను ఆయన కొట్టిపడేశారు. ఇది కొంతమంది ఊహించినట్లుగా అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన కొత్త విషయం కాదని వెంబు స్పష్టం చేశారు. “కొత్తగా చెప్పాలంటే స్వదేశీ సాఫ్ట్ వేర్‌కు ఇచ్చిన మొత్తం ప్రోత్సాహం కొంత విస్తృత ఉద్యమం. మరో మాటలో చెప్పాలంటే, నేను రెండు విషయాలను పోల్చాలనుకుంటున్నాను. భారీ పోటీ తర్వాత జోహో ఎంపికైంది. ఇప్పుడు, స్వదేశీ ఉద్యమంలో, ఈ కంపెనీ భారతదేశంలో తయారు చేయబడిందని కూడా మేము గ్రహించాము. మనం దీనికి మద్దతు ఇవ్వాలి. దీనిని ప్రోత్సహించాలి. మనకు ఈ జాతీయ ఛాంపియన్లు అవసరమని” పేర్కొన్నారు.