అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heavy Rain Alert | బంగాళాఖాతం (bay of bengal) లో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆగస్టు 25న (సోమవారం) అల్పపీడనం (LPA) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఆగస్టు 26, 27 తేదీల్లో తెలంగాణతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో శనివారం చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం వరకు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం తర్వాత పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సైతం చిరుజల్లులు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఏపీలోని కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి.
Heavy Rain Alert | మళ్లీ వర్షాలు
వాతావరణ శాఖ ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మూడు రోజులుగా వర్షాలు తగ్గడంతో గోదావరి(Godavari), కృష్ణా (Krishna) నదుల్లో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. గోదావరి నది వివరాలు చూస్తే.. భద్రాచలం వద్ద నీటిమట్టం 39.2 అడుగులు (ప్రస్తుతం ఎలాంటి హెచ్చరికలు లేవు). కూనవరం వద్ద 18.99 మీటర్లు, పోలవరం వద్ద 12.65 మీటర్లు, ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో/ఔట్‌ఫ్లో: 12.34 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
కృష్ణా నది (Krishna River)పై గల శ్రీశైలం డ్యాంకు 4.73 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా.. 5.14 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ వద్ద ఇన్‌ఫ్లో: 4.45 లక్షలు, ఔట్‌ఫ్లో: 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో/ఔట్‌ఫ్లో 3.92 లక్షల క్యూసెక్కులుగా నమోదు అవుతోంది. దీంతో మొదటి హెచ్చరికను ఉపసంహరించారు. అయితే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచన చేస్తున్నారు అధికారులు. మొత్తంగా రాబోయే రెండు మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ మరియు విపత్తుల నిర్వహణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.