అక్షరటుడే, వెబ్‌డెస్క్ : France PM | ఫ్రాన్స్ ప్రధాని(France PM) సెబాస్టియన్ తన పదవికి రాజీనామా చేశారు. పదవి చేపట్టిన నెల రోజుల్లోనే ఆయన అధికారం నుంచి తప్పుకున్నారు.
సెబాస్టియన్ నెల రోజుల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్‌కు సన్నిహితుడైన ఆయన వారాల తరబడి రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆదివారం తన మంత్రివర్గాన్ని నియమించారు. సోమవారం మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) సైతం నిర్వహించారు. అయితే ఆయన నియమించిన కేబినెట్‌పై విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలతో పాటు ఆయన మద్దతుదారులు సైతం దీనిని వ్యతిరేకించారు. దీంతో సెబాస్టియన్ సోమవారం రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు రాజీనామాను రిపబ్లిక్ అధ్యక్షుడికి సమర్పించగా.. ఆయన దానిని ఆమోదించారు.
France PM | రాజకీయ సంక్షోభం
లెకోర్నుకు ముందు ఉన్న ఇద్దరు మాజీలు ఫ్రాంకోయిస్ బేరౌ, మైఖేల్ బార్నియర్‌లను ఖర్చు ప్రణాళికపై ప్రతిష్టంభనలో శాసనసభ తొలగించడంతో ఫ్రాన్స్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా కొత్త ప్రధాని సైతం రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికారిక లెక్కల ప్రకారం.. ఫ్రాన్స్ ప్రభుత్వ రుణం రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రధాని రాజీనామాతో ఆ దేశ స్టాక్‌మార్కెట్(Stock Market) పడిపోయింది.
France PM | ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
ప్రధాని రాజీనామాతో ఆ దేశంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని రైట్ వింగ్ నాయకులు కోరుతున్నారు. వామపక్ష ఫ్రాన్స్ అన్‌బోవ్డ్ నేతలు మాక్రాన్ స్వయంగా వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. సెబాస్టియన్ 27 రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. ఆయన ప్రభుత్వం 14 గంటలే కొనసాగింది.