అక్షరటుడే, ఇందూరు: CITU Nizamabad | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు డిమాండ్ చేశారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (Telangana Agricultural Workers Union) ఆధ్వర్యంలో ఆదివారం కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ కంపెనీలకు (Corporate company) సంపదను, వనరులను కట్టబెడుతూ నిరుద్యోగం, పేదరికం పెరగడానికి కారణమవుతున్నాయన్నారు.
నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ ప్రజలను నిర్లక్ష్యం చేయడంతో జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గి పేదలు పట్టణాలకు వలస వెళ్తున్నారని, పట్టణాల్లో అప్పుల పాలవుతున్నారని తెలిపారు. వీటిని నివారించడానికి ఐక్య పోరాటాలు తప్ప మరొక మార్గం లేదన్నారు.
ఉపాధిహామీ కూలీలకు పని దినాలను పెంచడంతోపాటు, రేట్లు పెంచాలని, ఇల్లు లేని పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణ, పెద్ది వెంకట రాములు, నాయకులు లక్ష్మి, శంకర్, సాయిలు, గోవర్ధన్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
