అక్షరటుడే, వెబ్‌డెస్క్: RTC : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) మరో ప్రగతిశీల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ, ‘స్త్రీ శక్తి’ పేరుతో ప్రత్యేక పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించనుంది.
ఇప్పటికే ఈ పథకం ప్రయోజనాలకు సంబంధించిన జీరో టికెట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ టికెట్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) (Andhra Pradesh State Road Transport Corporation – APSRTC) పేరుతో పాటు డిపో పేరు, ప్రయాణించే రూట్, టికెట్ ధర, రాయితీ మొత్తం వంటి వివరాలు ముద్రించబడ్డాయి. టికెట్‌పై “రూ. 0.00″గా పేర్కొనడంతో పాటు మహిళల ఉచిత ప్రయాణానికి ‘స్త్రీ శక్తి’ (‘Stree Shakti) అనే పేరు పెట్టినట్టు స్పష్టమవుతోంది.
RTC : నమూనా టికెట్
ఈ పథకం అమలులో భాగంగా, రాష్ట్రంలోని మహిళలు తమ ఆధార్ (Aadhaar, , ఓటరు ఐడీ (voter ID ) లేదా పాన్ కార్డు (PAN card) చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. కొత్త బస్సులు వచ్చేంత వరకు, ప్రస్తుతం ఉన్న పాత బస్సుల్లోనే ఈ సౌకర్యం అందించనున్నారు.
అయితే, బస్సుల టైమింగ్స్ మరియు సిబ్బంది డ్యూటీ సమయంలో ఎటువంటి మార్పులు ఉండబోవని అధికారులు తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలోని ఎలాంటి దూర ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అమలులోకి రానుంది. ఇదే సమయంలో, తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్త మహిళలకు ఇదొక శుభవార్త. ఆర్టీసీ బస్సుల్లో RTC Busses తిరుమలకు కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.
పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 1,050 బస్సులు తీసుకురావాలని నిర్ణయించింది. ఏటా కొత్త ఎలక్ట్రిక్ బస్సులు Electric Bus సమకూర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
బస్సు స్టేషన్లలో మరుగుదొడ్లు, తాగునీటి వసతులు వంటి మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరుస్తున్నారు. రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ ఛైర్మన్, ఎండీలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ, ఈ పథకం అమలులో తలెత్తే సవాళ్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ పథకం విధివిధానాలపై పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 15 నుంచి అమలులోకి రానున్న ఈ పథకానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేస్తున్నారు. లక్షలాది మంది మహిళలు దీని ద్వారా లబ్ధిపొందనున్నట్లు అంచనా.