అక్షరటుడే, వెబ్డెస్క్ : Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) మహిళల కోసం మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. స్వాతంత్య్ర సందర్భంగా ఆగస్టు 15న ఈ కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Naidu) అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి బుధవారం (ఆగస్టు 7) జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది ఆమోదం రానుంది. ఆ వెంటనే పథకం విధివిధానాలపై మరింత స్పష్టత లభించనుంది.
Free Bus Scheme | ఎక్కడికైన వెళ్లొచ్చు..
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి (Ram Prasad Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. మహిళలు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ వంటి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. మొదట జిల్లా పరిధిలోని ప్రయాణాలకు మాత్రమే దీనిని అమలు చేయాలని భావించారు. అయితే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఎంత దూరం వెళ్లిన ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పలించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన “శ్రీశక్తి” హామీ ప్రకారం, ఇప్పుడు పూర్తిస్థాయిలో అమలుకు సిద్ధమవుతోంది. ఈ పథకానికి రాష్ట్రంలోని అందరు మహిళలు అర్హులు. వయసు, ఆదాయ పరిమితులు వంటి షరతులు ఏవీ ఉండవు.
ఉచిత ప్రయాణానికి మహిళలు ఆధార్ కార్డు(Aadhar Card), ఓటర్ ఐడీ(Voter ID), రేషన్ కార్డు (Ration Card) వంటి గుర్తింపు కార్డులలో కనీసం ఒకటి చూపించాలి. మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణం కోసం 6,700 బస్సులని వినియోగించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనుంది. భవిష్యత్తులో ఈ ఖర్చు తగ్గించేందుకు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుపై కూడా దృష్టి పెట్టనుంది. మహిళల ఆర్థిక భద్రత, స్వేచ్ఛా రవాణాకు ఇది ఒక కీలక అడుగు. ఇప్పటికే ఈ పథకంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆగస్టు 15న ప్రారంభం కానున్న ఈ పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది.