అక్షరటుడే, వెబ్డెస్క్: Aadhaar Update | యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తన సేవలను విస్తృతం చేస్తోంది. ఆధార్ కార్డుల జారీతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తున్న ఉడాయ్.. ఇప్పుడు పిల్లల ఆధార్ అప్‌డేట్ (Aadhaar Update) కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఐదేళ్ల పైబడిన పిల్లల ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఆధార్ సెంటర్లు, మీసేవ వద్ద గంటల తరబడి వేచిచూసే అవసరం లేకుండా చేస్తోంది. ఇందుకోసం పిల్లలు చదువుకునే స్కూళ్లలోనే ఉచితంగా ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ చేపట్టనుంది.
Aadhaar Update | అన్నింటికీ ఆధారమే..
ఆధార్ కార్డు (Aadhaar Card).. భారతీయులకు ఎంతో కీలకమైన ఆధారం. ఇది కేవలం గుర్తింపు మాత్రమే కాదు.. ప్రతీ దానికి ఉపయోగపడే, సామాజిక భద్రత కల్పించే కార్డు. ఆధార్ కార్డులో పేరు, లింగం, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ సహా.. కనుపాప స్కాన్, వేలి ముద్రలు వంటి బయోమెట్రిక్ సమాచారం (Biometric Information) నిక్షిప్తమై ఉంటుంది. ఒక్క ప్రభుత్వ పథకాలే కాదు, బ్యాంకులు, ఇతర సేవలు పొందాలన్నా ఆధార్ కార్డే ప్రామాణికంగా మారింది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసే ఈ 12 అంకెల విశిష్ట సంఖ్యకు ఎంతో ప్రాధాన్యముంది. ప్రభుత్వ సేవలు, ఆర్థిక లావాదేవీలు, అనేక ఇతర ప్రయోజనాలను పొందడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా, పాస్‌పోర్టు కావాలన్నా, పాన్ కార్డుకు దరఖాస్తు చేయాలన్నా.. విద్యాసంస్థల్లో ప్రవేశాలు తీసుకోవాలన్నా, ప్రభుత్వ పథకాలు(Government Schemes) పొందాలన్నా ఆధార్ కార్డు ప్రామాణికంగా మారింది.
Aadhaar Update | పిల్లల అప్‌డేట్ కోసం..
పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల వేలిముద్రల ఆధారంగా ఆధార్ కార్డు మంజూరు చేస్తున్నారు. పిల్లలకు ఐదేళ్లు దాటిన తర్వాత ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించాలి. అంటే చిన్నారులకు ఐదేళ్లు నిండిన తర్వాత వారి వేలిముద్రలను ఆధార్ కార్డుతో అనుసంధానం (అప్‌డేట్) చేయించాలి. కానీ చాలా మంది దీనిని మర్చిపోతున్నారు. పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నా వారి ఆధార్ మాత్రం అప్‌డేట్ చేయించట్లేదు. ఇలా ఆధార్ కార్డు అప్‌డేషన్ చేయించని చిన్నారులు దేశవ్యాప్తంగా 7 కోట్ల మందికి పైగా ఉన్నారని ఉడాయ్ (UIDAI) గుర్తించింది. వారి కోసం కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. చిన్నారుల బయోమెట్రిక్ ఆధార్ అప్‌డేట్ (Biometric Aadhaar Update) ప్రక్రియను సులభతరం చేసేందుకు గాను పాఠశాలల్లోనే దశల వారీగా ఈ ప్రక్రియను చేపట్టనుంది.
Aadhaar Update | రెండు నెలల్లో ప్రారంభం..
స్కూళ్లోనే పిల్లల అప్‌డేట్ ప్రక్రియను ప్రారంభించే ప్రయత్నాలు చేపట్టామని ఉడాయ్ సీఈవో భువనేశ్ కుమార్(UDAI CEO Bhuvanesh Kumar) వెల్లడించారు. ప్రస్తుతం దీనిక సంబంధించిన టెక్నాలజీ ప్రయోగ దశలో ఉందని చెప్పారు. “పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్‌ను తల్లిదండ్రుల అంగీకారంతో.. స్కూళ్లలోనే చేపట్టేందుకు మేం ప్రాజెక్టును రూపొందిస్తున్నాం. ప్రస్తుతానికి దీనికి కావాల్సిన సాంకేతికతను పరీక్షిస్తున్నాం. మరో 45 నుంచి 60 రోజుల్లో ఇది సిద్ధమవుతుంది.” అని తెలిపారు.
ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపించి, ప్రతి పాఠశాలలో ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అనేక ప్రభుత్వ పథకాల అమలులో ఆధార్ కీలకమని, ప్రతి చిన్నారికీ సమయానికి ప్రయోజనాలు అందాలంటే ఆధార్ తప్పనిసరి అని వివరించారు. అందుకే పాఠశాలల ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలనుకుంటున్నామని చెప్పారు.
Aadhaar Update | పదేళ్లకోసారి అప్‌డేట్..
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు అప్‌డేట్‌ను చేయించుకోవాల్సి ఉంటుంది. పుట్టిన పిల్లలకు తీసుకునే ఆధార్ కార్డును, వారికి ఐదేళ్లు నిండిన తర్వాత చేయించాలి. ఇక, 15 ఏళ్లు పూర్తయిన పిల్లలకు తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. యుక్త వయస్సుకు వచ్చిన పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) కోసం కూడా కొత్త విధానాన్ని తీసుకురావాలని ఉడాయ్ చూస్తోంది. వారు చదివే స్కూళ్లు, కాలేజీల ద్వారా ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ అమలుకు శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది. స్కూల్ అడ్మిషన్, నగదు బదిలీ పథకాలు, స్కాలర్‌షిప్‌లు వంటి ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ వివరాలు ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండడం అత్యవసరం.