అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Christian Medical College | నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి (Dichpalli) శివారులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (CMC) పున:ప్రారంభం పేరిట ఓ వ్యక్తి పలువురిని మోసం చేశాడు. ఈ మేరకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ నివేదిక సమర్పించింది.
డిచ్పల్లిలోని సీఎంసీ హాస్పిటల్, మెడికల్ కాలేజీ నిర్వహించడానికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రీసెర్చ్ (IMSR) ఛైర్మన్ షణ్ముగం మహాలింగంతో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆయన తాను రిటైర్ట్ ఐఏఎస్ అధికారిని అని చెప్పి పలువురి వద్ద మెడికల్ కాలేజీలో పెట్టుబడుల పేరిట డబ్బులు వసూలు చేశాడు.
Christian Medical College | డైరెక్టర్ పదవి ఇస్తానని..
నిజామాబాద్‌కు చెందిన డాక్టర్ అజ్జా శ్రీనివాస్‌కు మెడికల్ కాలేజీలో డైరెక్టర్ పదవి ఇస్తానని మహాలింగం నమ్మించాడు. ఆయన నుంచి రూ.2.2 కోట్ల పెట్టుబడుల పేరిట వసూలు చేశాడు. అనంతరం ఆయనను మోసం చేశాడు. అంతేగాకుండా శ్రీనివాస్‌పైనే పోలీసులకు ఫిర్యాదు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితుడు ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Christian Medical College | అనేక ఆరోపణలు
షణ్ముగం మహాలింగంపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ (CSITA) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి, మెడికల్ కాలేజీలో మౌలిక సదుపాయాలు, వైద్య పరిపాలనా సామగ్రిని సరఫరా చేసే అనేక మంది విక్రేతలకు ఆయన డబ్బులు చెల్లించలేదు. రూ.2.5 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆస్పత్రిలో మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లకు రూ.40 లక్షలు చెల్లించలేదు. అధ్యాపకులకు రూ.70 లక్షల మేర జీతాలు చెల్లించకుండా మోసం చేశాడు. ఆస్పత్రి నర్సులు, వార్డ్ సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, హౌస్ కీపింగ్ సిబ్బందితో సహా కీలకమైన ఫ్రంట్‌లైన్ కార్మికులకు నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. అంతేగాకుండా షణ్ముగం మహలింగం కొంతకాలంగా పరారీలో ఉన్నాడు. దీంతో ఉద్యోగులు కొంతకాలంగా ఆందోళన చెందుతున్నారు.
Christian Medical College | చర్యలు చేపట్టిన సీఎస్ఐటీఏ
షణ్ముగం మహాలింగం పలువురు వైద్యులను, సిబ్బందిని కాంట్రాక్టర్లను మోసం చేయడంతో సీఎస్ఐటీఏ చర్యలు చేపట్టింది. ఉద్దేశపూర్వకంగా ఆయన మోసానికి పాల్పడినట్లు పేర్కొంది. దీంతో ఆయనతో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. మరోవైపు నేషనల్ మెడికల్ కౌన్సిల్ సైతం ఈ కళాశాలకు అనుమతులు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అసలు బండారం బయటపడింది.