అక్షరటుడే, వెబ్డెస్క్: Fractal Analytics IPO | ప్రముఖ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కంపెనీ ఫ్రాక్టల్ అనలిటిక్స్ ఐపీవోకు వస్తోంది. ఈ కంపెనీనీ 2000 సంవత్సరంలో ప్రారంభించారు. పాతికేళ్లలో గ్లోబల్ ఏఐ, డేటా అనలిటిక్స్ కంపెనీగా బలంగా ఎదిగింది. పెద్ద కంపెనీలకు ఏఐ సొల్యూషన్స్ ఇస్తోంది. మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, అమెజాన్, మెటా, టెస్లా వంటి కంపెనీలను క్లయింట్లుగా కలిగి ఉంది. రెవెన్యూలో 65 శాతానికిపైగా అమెరికా నుంచే వస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్, ముంబయిలతోపాటు 17 చోట్ల కార్యాలయాలు కలిగి ఉన్న ఈ కంపెనీలో 4,500లకుపైగా మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ఐపీవో ద్వారా రూ. 2,833.90 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ లక్ష్యం. ఇందులో ప్రెష్ ఇష్యూ ద్వారా రూ. 1,023.50 కోట్లు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ. 1,810.40 కోట్లు సమీకరించనుంది. ఐపీవో (IPO) ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపు, కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి వాడనున్నట్లు కంపెనీ తెలిపింది.
కంపెనీ ఆర్థిక పరిస్థితి..
2025 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రూ. 2,765 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 26 శాతం ఎక్కువ. నికర లాభం రూ. 22 కోట్లుగా నమోదయ్యింది. అంతకుముందు సంవత్సరంలో రూ. 5.47 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈబీఏటీడీఏ మార్జిన్ 10.6 శాతం నుంచి 17.4 శాతానికి పెరిగింది.
ధరల శ్రేణి..
ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 857 నుంచి రూ. 900 లుగా కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్లో 16 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14 వేలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోటా, జీఎంపీ.
క్యూఐబీలకు 75 శాతం, ఎనఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం కోటా కేటాయించారు. మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీవోకు గ్రే మార్కెట్ ప్రీమియం తక్కువగా ఉంది. ఒక్కో షేరు రూ. 42 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. అంటే లిస్టింగ్ సమయంలో 4.5 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఐపీవో తేదీలు..
ఫిబ్రవరి 9న సబ్స్క్రిప్షన్ ప్రారంభం అవుతుంది.
ఫిబ్రవరి 11న క్లోజ్ అవుతుంది.
ఫిబ్రవరి 12న రాత్రి అలాట్మెంట్ స్టేటస్ వెల్లడవుతుంది.
ఫిబ్రవరి 16న కంపెనీ షేర్లు BSE, NSEలలో లిస్టవుతాయి.