Eng vs Ind
IND vs ENG | నేటి నుంచి భార‌త్- ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌.. గాయాల‌తో ప‌లువురు భార‌త క్రికెట‌ర్స్ దూరం

అక్షరటుడే, వెబ్​డెస్క్ :IND vs ENG | భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ టాప్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల తర్వాత సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యం సంపాదించింది. ఇక నాలుగో టెస్ట్‌ మ్యాచ్ జులై 23న మాంచెస్టర్‌(Manchester)లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెల‌వ‌డం భార‌త్‌కు త‌ప్ప‌నిస‌రి. ఓడితే మాత్రం సిరీస్ కోల్పోయిన‌ట్టే. ఇక ఇంగ్లాండ్ జట్టు(England Team) ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో 3-1తో ఆధిక్యం సాధించాలని కోరుకుంటోంది. ఈ మ్యాచ్ గెల‌వాల‌ని భార‌త్ బలంగా కోరుకుంటున్నా.. జ‌ట్టు ఆట‌గాళ్లు గాయాల బారిన ప‌డ‌డం పెద్ద స‌మ‌స్యగా మారింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌ర‌పున‌ ఎవరెవరు ఆట‌గాళ్లు ఆడ‌తారు, ఎవ‌రు రెస్ట్ తీసుకుంటారు అనే దానిపై సందిగ్ధం నెల‌కొంది.

IND vs ENG | ఎవ‌రు గెలుస్తారు?

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌(Test Series)లో కీలకమైన నాలుగో మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మీడియా సమావేశంలో పలు ముఖ్య అంశాలపై స్పష్టత ఇచ్చారు. గాయాల కారణంగా జట్టులో మార్పులు తప్పవని ఆయన తెలిపారు. పేసర్ ఆకాష్ దీప్ గజ్జల్లో గాయంతో టెస్ట్‌కు దూరం కానున్నాడ‌ని తెలియ‌జేశారు. అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) చేతి గాయంతో అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో 24 ఏళ్ల హర్యానా ఫాస్ట్ బౌలర్ అంశుల్ కాంబోజ్ అరంగేట్రం చేసే అవకాశం ఎక్కువగా ఉందని గిల్(Shubman Gill) తెలిపారు. అంశుల్ బౌలింగ్‌లో బాగా ఆకట్టుకున్నాడు. ప్రసిద్ కృష్ణనా, లేకుంటే అంశుల్‌లో ఎవ‌రిని తీసుకోవాలా అనే దాని గురించి ఆలోచిస్తాం అని చెప్పారు.

మూడో టెస్టులో వేలి గాయం కారణంగా కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న రిషబ్ పంత్‌(Rishab Panth) ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. నాలుగో టెస్టులో వికెట్ కీపింగ్‌ను తిరిగి చేపట్టనున్నట్లు గిల్ ధ్రువీకరించారు. ఇది జట్టుకు భారీ బూస్ట్ అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈ సిరీస్‌లో పెద్దగా స్కోర్లు చేయలేకపోయిన కరుణ్ నాయర్‌పై విశ్వాసం వ్యక్తం చేసిన గిల్, “అతను ఫామ్‌లోకి వస్తాడు. తన స్థానంలో బ్యాటింగ్ చేయ‌లేదు, అత‌నితో మాట్లాడాము అంటూ మద్దతు తెలిపారు శుభ్‌మ‌న్ గిల్. ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మోకాలి గాయంతో సిరీస్‌కి దూరమవడంతో భారత్ కనీసం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కాంబోజ్ లేదా ప్రసిద్ కృష్ణ పేస్ విభాగాన్ని భర్తీ చేయనుండగా, నితీష్ స్థానంలో అదనపు బ్యాట్స్‌మన్ లేదా ఆల్‌రౌండర్ ఆడే అవకాశం ఉంది. భార‌త‌ జట్టు గాయాల సమస్యలతో పోరాడుతుండగా, వర్షం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.