అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vaddepalli Municipality | జోగులాంబ గద్వాల (Jogulamba Gadwala) జిల్లా వడ్డేపల్లి (Vaddepalli) మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)తో తమకు సంబంధం లేదని ఆ పార్టీ నేత వడ్డేపల్లి శ్రీనివాస్ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో కవిత ఫార్వార్డ్ బ్లాక్ పార్టీకి మద్దతు ఇచ్చారు. పలువురు జాగృతి కార్యకర్తలు ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే వివిధ పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వారు సైతం ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇలాగే వడ్డేపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే కవిత ఆ పార్టీకి మద్దతు తెలపడంతో కవిత ఖాతాలో మున్సిపాలిటీ చేరిందని వార్తలు వచ్చాయి. దీనిపై రెబల్ గ్రూప్‌నకు నాయకత్వం వహించిన శ్రీనివాస్ స్పందించారు. తమకు కవితతో సంబంధం లేదన్నారు.
Vaddepalli Municipality | అసలు ఏం జరిగిందంటే?
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో పది వార్డులు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన తన వర్గానికే చెందిన వారికి టికెట్లు ఇవ్వాలని వడ్డేపల్లి శ్రీనివాస్ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డిని కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో వడ్డేపల్లి శ్రీనివాస్ తన వర్గం వారితో కలిసి ఫార్వార్డ్ బ్లాక్ తరఫున 10 వార్డుల్లో పోటీ చేశారు. అందులో 8 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో ఫార్వార్డ్ బ్లాక్ ఖాతాలో ఓ మున్సిపాలిటీ చేరింది. అయితే తమకు కవితతో సంబంధం లేదని ఆయన ప్రకటించారు. తిరిగి వారు బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉంది.